నీరవ్‌ బ్రిటన్ లో ఉన్నాడు. ధ్రువీకరించిన మంత్రి విలియమ్స్‌

దిల్లీ:
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను వేల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ లండన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బ్రిటన్‌ మంత్రి బరోనెస్‌ విలియమ్స్‌ ధ్రువీకరించారు. నీరవ్‌ లండన్‌లో ఉన్నాడని ఆయన చెప్పారు. పీఎన్‌బీకి కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నీరవ్‌ను అప్పగించేందుకు భారత్‌కు సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. దిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజుజుతో జరిగిన ఓ సమావేశానికి విలియమ్స్‌ హాజరయ్యారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యాను కూడా భారత్‌కు అప్పగించేందుకు తప్పకుండా మద్దతు ఇస్తామని విలియమ్స్‌ హామీ ఇచ్చారు. ఎస్‌బీఐకి వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మాల్యా రెండేళ్ల నుంచి లండన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్‌ రప్పించేందుకు భారత్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రూ.13వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నీరవ్‌, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్‌ చోక్సీ లండన్‌లో పొలిటికల్‌ ప్రాసిక్యూషన్‌ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై తొలుత బ్రిటన్‌ హోంశాఖ అధికారులు నిరాకరించారు. అటువంటి సమయంలో యూకె మంత్రి నీరవ్‌ తమ దేశంలో ఉన్నాడని చెప్పడం విశేషం.ఇదిలా ఉంటే నీరవ్‌ మోదీ ఎక్కడ ఉన్నాడనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ ఉన్నాడో తెలిస్తే.. తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి. నీరవ్‌, చోక్సీలకు వ్యతిరేకంగా రెడ్‌ కార్న్‌ నోటీస్‌(ఆర్‌సీఎన్‌) జారీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.‌