నీరవ్ మోడీ పాస్‌పోర్ట్‌ రద్దు కాలేదు.

న్యూఢిల్లీ:
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ స్వేచ్ఛగా ఒక దేశం తర్వాత మరొకటిగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ఈ ఆర్థిక నేరగాడు తన దగ్గరున్న ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లతో తిరగగలుగుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ నీరవ్ దగ్గర ఒకటే పాస్‌పోర్ట్‌ ఉంది.. దానిని భౌతికంగా రద్దు చేయలేదని విదేశాంగ వ్యవహారాల శాఖ చావు కబురు చల్లగా చెప్పింది. నీరవ్ మోడీకి పాత పాస్‌పోర్ట్‌ అందజేసిన తర్వాతే కొత్త పాస్‌పోర్ట్‌ జారీ చేయడం జరిగిందని.. అతని దగ్గర ఉన్నది ఒకేఒక్క పాస్‌పోర్ట్‌ మాత్రమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. చట్టప్రకారం పాస్‌పోర్ట్‌ పత్రాలను భౌతికంగా రద్దు చేస్తేనే పూర్తిస్థాయిలో రద్దు అమలవుతుందని అసలు లొసుగు బయటపెట్టింది. పాస్‌పోర్ట్‌ దుర్వినియోగం కాకుండా చూసేందుకు దానిని భౌతికంగా రద్దు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
జనవరిలో భారత్ నుంచి పారిపోయిన నీరవ్ మోడీ ప్రస్తుతం యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. అతనిని పట్టుకొనేందుకు సాయపడాలని యూరోపియన్ దేశాలకు లేఖ రాసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈయూ దేశాల్లో నీరవ్ మోడీని ప్రవేశించకుండా ఆపాలని.. అతనెక్కడ ఉన్నాడో తెలియజేయాలని లేఖలో కోరినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. నీరవ్ పాస్‌పోర్ట్‌ రద్దు నోటీసును దేశవిదేశాల్లోని అన్ని పాస్‌పోర్ట్‌ జారీ కార్యాలయాలకు పంపినట్టు చెప్పారు. దీని గురించి దర్యాప్తు సంస్థలకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. రద్దు చేసిన పాస్‌పోర్ట్‌ను పరారీలో ఉన్న వ్యక్తి చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని తిరుగుతాడని.. అతనిని పట్టుకోవడం సంబంధిత ప్రభుత్వ శాఖల పని అని విదేశాంగ మంత్రిత్వశాఖ చేతులు దులుపుకొంది. దీంతో నీరవ్ మోడీ విదేశాలకు పారిపోకుండా తీసుకున్న చర్యలు, ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు తలెత్తుతున్నాయి.