నెత్తురోడిన ఛత్తీస్ గఢ్.

రాయ్‌పూర్‌:
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గొల్లపల్లి ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.గొల్లపల్లి అటవీప్రాంతంలో దాదాపు 200 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని.. వెంటనే కూంబింగ్‌ చేపట్టినట్లు యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌ ప్రత్యేక డీజీ డీఎం అవస్థీ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.