నేడు వనపర్తి ‘ఆశీర్వాదసభ’

వనపర్తి:
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం వనపర్తిలో జరిగే ఆశీర్వాద సభకు హాజరౌతున్నారు. ప్రగతి భవనం నుంచి ఉదయం నుంచి 12 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరి వనపర్తికి చేరుకుంటారు. ఇక్కడ నాగారం గ్రామ సమీపంలోని మైదానంలో జరిగే బహిరంగ సభకు మధ్యా హ్నం రెండు గంటలకు చేరుకుంటారు. ఇదే వేదిక నుంచి ‘పాలమూరు జిల్లా ఎన్నికల శంఖారావం’ పూరించనున్నారు. సుమారు ఐదు లక్షల మందికి పైగా హాజరు కావచ్చునని అంచనా. సభా ఏర్పాట్లను మహబూబ్ నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి, మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి, వనపర్తి టిఆర్‌ఎస్ అభ్యర్ధి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. వారే దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, మఖ్తల్ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నారాయణపేట నుంచి రాజేందర్‌రెడ్డి, జడ్చర్ల నుంచి లకా్ష్మరెడ్డి, కల్వకుర్తి నుంచి జైపాల్ యాదవ్, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు, వనపర్తి నుంచి నిరంజన్‌రెడ్డి, అలంపూర్ నుంచి డాక్టర్ అబ్రహాం, గద్వాల నుంచి బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణరావులు. కొడంగల్ నుంచి నరేందర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాలను మమ్మరం చేశారు. అందరి కంటే ముందు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

పార్టీ ముఖ్య నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని కెసిఆర్ నాయకత్వంలోని పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి మరో సారి ఆశీర్వదించాలని మరో సారి అభ్యర్థిస్థున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. మహబూబ్ నగర్ ఎంపి జింతేందర్ రెడ్డి, అపద్ధర్మ మంత్రులు డాక్టర్ లకా్ష్మరెడ్డి,జూపల్లి కృష్ణారావు మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలో ప్రచారం నిర్వహిస్తూనే సిఎం సభకు భారీ ఎత్తున జనాలను తరలించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. గత నాలుగన్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా టిఆర్‌ఎస్ నాయకులు వాడుకోనున్నారు.వనపర్తి బహిరంగసభలో కాంగ్రెస్ నేతలపై టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ బాణాలు ఎక్కుపెట్టనున్నారు. పాలమూరు జిల్లాలో నాలుగున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ది పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, ప్రాజెక్టులపై కుట్రలు, కుతంత్రాను ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వేస్తున్న కేసులపై కూడా కెసిఆర్ ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు అభివృద్దికి టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ, ప్రతిపక్షాలపై కెసిఆర్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం అద్యంతం జోష్ పెంచేదిగా ఉండబోతుందని భావిస్తున్నారు.