‘నోబెల్ శాంతి’ బహుమతికి ప్రధాని మోడీ పేరు.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
భారత ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ అన్నారు. ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా అందుకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. దేశంలోని 50 కోట్ల మంది పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే రికార్డు సృష్టిస్తుందని తమిళసై అంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశ వ్యాప్తంగా 13,000 ఆసుపత్రులు పని చేస్తాయని తమిళసై సౌందరరాజన్ గుర్తు చేశారు. ఇంత పెద్ద పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలులో లేదని.. దానికి రూపకల్పన చేసిన మోదీకి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తమిళసై అన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రధాని మోడీ సేవలు గుర్తించి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తాను ఆయన పేరును నామినెట్ చేసినట్టు తమిళసై తెలిపారు. ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలు అందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రముఖ ప్రైవేట్ యూనివర్శిటీలో నెఫ్రాలజీ విభాగం చీఫ్, సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న తన భర్త డాక్టర్ పి. సౌందరరాజన్ కూడా మోడీ పేరును నోబెల్ కు నామినెట్ చేశారని ఆమె వివరించారు. 2019 జనవరి 31వ తేదీలోపు నోబెల్ శాంతి బహుమతి కోసం నరేంద్ర మోడీ పేరు నామినెట్ చేయాల్సి ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకం అని చెబుతున్న పాలకపక్షం దీనిని మోడీ కేర్ గా అభివర్ణిస్తోంది.