న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం స్టూడియో ఎన్ ఉద్యోగులకు టీయుడబ్ల్యుజె-ఐజేయు భరోసా.

హైదరాబాద్:
ఉద్యోగుల కడుపు గొట్టేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తే, చట్టబద్ధంగానే తగిన రీతిలో బుద్దిచెప్పి తీరుతాం… ఉద్యోగులకు న్యాయం జరిగేంతవరకు పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని టీయుడబ్ల్యుజె-ఐజేయు, హెచ్ యు జె నాయకులు స్టూడియో ఎన్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ ను చెల్లించాలనే డిమాండుతో విధులను బహిష్కరించి, రెండు రోజులుగా శాంతియుత నిరసనకు దిగిన స్టూడియో ఎన్ ఉద్యోగులను శనివారం నాడు టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, హెచ్ యు జె కార్యదర్శి శంకర్ గౌడ్ లు పరామర్శించి, తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి విరాహత్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగుల శ్రమ దోపిడీకి పాల్పడి, వారి కడుపు గొట్టేందుకు ప్రయత్నించే యాజమాన్యాలు ఏ స్థాయిలో ఉన్న వారికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. స్టూడియో ఎన్ న్యూస్ ఛానెల్ యాజమాన్యం ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు ఎగ్గొట్టి మానసికవ్యధకు గురిచేయడం సహించారనిదన్నారు. ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ ను, వారి పేరిట జమా చేయకపోవడం యాజమాన్య అక్రమాలకు సాక్ష్యమన్నారు. యాజమాన్య వైఖరి మూలంగా మానసిక ఆందోళనకు గురైన ఒక ఉద్యోగి ఆత్మహత్య కు ప్రయత్నించడం, ముగ్గురు ఉద్యోగులు మంచాన బట్టడం విచారకరమన్నారు. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుందని, మానసిక ఆందోళనకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి వాటిని పరిష్కరించుకోవాలని ఉద్యోగులకు విరాహత్ ధైర్యాన్ని అందించారు. ఈ సందర్భంగా తగు కార్యాచరణ కోసం ఉద్యోగుల సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు.