పంచాయతి ఎన్నికలు వద్దు మొర్రో అంటున్న ఎం.ఎల్.ఏ లు

గ్రామ పంచాయతి ఎన్నికలు ‘ఏకపక్షం’ గా జరిగే సూచనలు లేవని ఇంటెలిజెన్సు అధికారవర్గాలు హెచ్చరిస్తున్నవి.కాంగ్రేస్ పార్టీ ఇదివరకటికన్నా కాంత్ ‘దూకుడు’ పెంచడం,కోదండరాం తెలంగాణ జనసమితి,ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కో ఆర్దినేషన్ తో పని చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నందున టిఆర్ ఎస్ అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కోక తప్పదని ఆ వర్గాలు చెబుతున్నవి.

హైదరాబాద్;
గ్రామ పంచాయతి ఎన్నికలపై అధికార పార్టీ టిఆర్ఎస్ శాసనసభ్యులు గజ,గజ వణికిపోతున్నారు.గ్రామస్థాయిలో పరిస్థితులు అనుకున్నంత మేరకు ఆశాజనకంగా లేదని కొందరు శాసన సభ్యులు అంటున్నారు.గ్రామ పంచాయతి ఎన్నికలు ‘ఏకపక్షం’ గా జరిగే సూచనలు లేవని ఇంటెలిజెన్సు అధికారవర్గాలు హెచ్చరిస్తున్నవి.కాంగ్రేస్ పార్టీ ఇదివరకటికన్నా కాంత్ ‘దూకుడు’ పెంచడం,కోదండరాం తెలంగాణ జనసమితి,ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కో ఆర్దినేషన్ తో పని చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నందున టిఆర్ ఎస్ అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కోక తప్పదని ఆ వర్గాలు చెబుతున్నవి.
ఇటీవలే రైతుబందు పథకం కింద ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది.దీంతో క్షేత్ర స్థాయిలో వాతావరణం తమకు అనుకూలంగా ఉంటుందని టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ గా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.ఒక వేళ ఫలితాలు ఏవైనా కారణాలతో భిన్నంగా వస్తే తమ భవిష్యత్తు ఆగమ్యగోచరం కాగలదని ఎం.ఎల్.ఏ.ల వాదన.జూలై చివరికి సర్పంచుల పదవీకాలం పూర్తీ కానున్నది.ఈ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది.
4300 గిరిజన తండాలు, గూడెలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు.ఈ కొత్త పంచాయతీలలో తమకు తిరుగుండదన్నది కెసిఆర్ భావన.కానీ మెజారిటీ ఎం.ఎల్.ఏ.లు గ్రామపంచాయతి ఎన్నికలంటేనే హడలిపోతున్నారు.ఊహిస్తున్న డానికి విరుద్ధంగా ఫలితాలు ఉండే ప్రమాదం ఉందని వారంటున్నారు.పలు జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో గ్రూప్ తగాదాలు ఉన్నవి.ఉదాహరణకు నిజామాబాద్ రూరల్ లో స్థానిక శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ కు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్. ఎం.ఎల్.సి.భూపతిరెడ్డి ల మధ్య పొసగడం లేదు.వర్గపోరు బహిరంగం కాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటి ప్రభావం ఉంటుందని అంచనా.కొన్ని చోట్ల ఎం.ఎల్.ఏ.ల పట్ల కార్యకర్తలు,కెసిఆర్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. కొన్ని చోట్ల వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య టిఆర్ ఎస్ లో సమన్వయం లేదు.గ్రామ పంచాయతి సర్పంచు పదవికి దాదాపు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న గ్రామాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నవి.వారిని నచ్చ జెప్పే పార్టీ యంత్రాంగం లేదు.నచ్చజెప్పినా వినే వారు కరవు.ఈ వ్యవహారం అంతా తమకు తలనొప్పిగా మారుతుందని శాసనసభ్యుల ఆవేదన.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే వ్యవసాయ మంత్రి పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ మినహా బాల్కొండ, ఆర్మూరు,బోధన, కామారెడ్డి,ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో పరిస్థితి ‘అనుకూలంగా’ లేదని అంటున్నారు.జుక్కల్ లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది.జిల్లాల పునర్విభజన వల్ల తలెత్తిన కొన్ని సమస్యలు ఇంకా అపరిష్క్రుతంగానే ఉన్నట్టు చెబుతున్నారు.కొత్తగా మండలాల ఏర్పాటు సమయంలో కొన్ని నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. బాల్కొండ, ఆర్మూరు ఎం.ఎల్.ఏ.ల పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గురించి ఇంటలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి ఇదివరకే సమర్పించిన నివేదికలలో పేర్కొన్నాయి.