పంచాయ‌తీ వ్య‌వ‌హారాల‌న్నీ విధిగా ఆన్‌లైన్‌లో. – మంత్రి జూప‌ల్లి స‌మీక్ష‌.

హైద‌రాబాద్‌:
నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని ప‌క‌డ్బంధీగా అమ‌లు చేయాల‌ని, చ‌ట్టం అమ‌ల్లోకి రాక‌ముందు పంచాయ‌తీలు ఇచ్చిన లే అవుట్‌, భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌పై స‌మ‌గ్ర నివేధిక ఇవ్వాల‌ని పంచాయ‌తీరాజ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో పొందుప‌ర్చిన ప‌లు అంశాల‌పై హెచ్ ఎం డీ ఏ, పంచాయ‌తీరాజ్, నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్‌ అధికారుల‌తో స‌చివాల‌యంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. పంచాయ‌తీ వ్య‌వ‌హారాల‌న్నీ ఆన్‌లైన్ లో పొందుప‌ర్చే దిశ‌గా తీసుకున్న చ‌ర్య‌ల‌ను పంచాయ‌తీరాజ్ మ‌రియు ఎన్ ఐ సి అధికారులు మంత్రికి వివ‌రించారు. ఇప్ప‌టికే లే అవుట్లు, భ‌వన నిర్మాణ అనుమ‌తులు, ట్రేడ్ లైసెన్స్ లాంటి వాటితో పాటు ఆదాయానికి సంబందించి దాదాపు 70 శాతం వ‌ర‌కు ఆన్‌లైన్‌లో పొందుప‌ర్చేలా సాఫ్ట్ వేర్ సిద్ద‌మైంద‌ని అధికారులు తెలిపారు. ఖ‌ర్చుల‌కు సంబంధించి ఇంకా ఆప్ డేట్ చేయాల్సి ఉంద‌న్నారు. ఆన్‌లైన్ లో పొందుప‌ర్చేందుకు సాఫ్ట్ వేర్‌ను సిద్దం చేయ‌డంలో జ‌రుగుతున్న జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాగే పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్ర‌కారం 300 స్క్వేర్ యార్డుల‌క‌న్నా ఎక్కువ స్థ‌లంలో లేదా జీ ప్ల‌స్ 2 క‌న్నా అద‌నంగాభ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌న్నీ హెచ్ ఎండీఏ లేదా డీటీసీఏ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో హెచ్ ఎండీ ఏ క‌మిష‌న‌ర్ చిరంజీవులుతో పాటు ఇత‌ర అధికారుల‌తోనూ ఈ అంశంపై మంత్రి జూప‌ల్లి చ‌ర్చించారు. హెచ్ ఎం డీఏ, డీటీసీపీతో పాటు ఇత‌ర అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీల సాఫ్ట్ వేర్‌ను కూడా గ్రామ‌పంచాయ‌తీల సాఫ్ట్‌వేర్‌తో అనుసంధించి, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలోపు భ‌వ‌న నిర్మాణ‌, లే అవుట్ అనుమ‌తులు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. అలాగే గ్రామ స‌భ‌ల మినిట్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స‌మావేశంలో పంచాయ‌తీరాజ్ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్‌రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, ఎన్ ఐసీ అధికారులు పాల్గొన్నారు.