‘పంటబీమా’ కోసం అన్నదాత రోడ్డెక్కని రోజు వస్తుందా!!

మహబూబ్ నగర్:
పంటల బీమా కల్పించండనే డిమాండ్‌తో రోడ్లు ఎక్కవలసిన రైతులు ఇచ్చే బ్యాంకు పంట రుణాలలో బీమా ప్రీమియం డబ్బులుపట్టుకోవద్దు అని రోడ్ల పైకి వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పంటల బీమా అంటే రైతులు ఎంతగా విసుగెత్తి ఉన్నారోఇది చెబుతున్నది. దాదాపు సంవత్సరం క్రితం ‘రైతు స్వరాజ్య వేదిక’ రైతు ఆత్మహత్య కుటుంబాల గురించి అధ్యయనం చేసినప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భాగమైన బ్రాహ్మణపల్లి, ఇర్విన్, మాడుగుల తదితర గ్రామాల రైతులు బ్యాంకులో పంట రుణం తీసుకోవటానికి వచ్చారు. మేము అక్కడికి వెళ్లే సరికి బ్యాంకు అధికారులకు రైతులకు మధ్య చిన్న గొడవ మొదలైంది.బ్యాంకు ఇచ్చే పంట రుణాలలో బీమా ప్రీమియం పట్టుకోవద్దని రైతులు, బీమా ప్రీమియం కట్టందే పంట రుణమే ఇవ్వమని బ్యాంకు అధికారులు భీష్మించుకున్నారు. బీమా మాకు ఇష్టమైతే కడతాం లేదంటే లేదు బలవంతంగా బీమా ప్రీమియం పట్టుకోవటానికి బ్యాంకు అధికారులు ఎవరని ప్రశ్నిస్తూ రైతు రోడ్డుపై బైఠాయించారు. గత 5 సంవత్సరాలుగా బీమా ప్రీమియం కట్టటమే కానీ ఒక్క సారి కూడా క్లెయిమ్ రాలేదన్నది వారి ప్రధాన ఆరోపణ, ఈ 5 సంవత్సరాలలో 3 సార్లు పంట నష్టపోయాము. ఒక్కసారి క్లెయిమ్ కూడా రానప్పుడు ఇక పంటల బీమా కట్టటం దేనికని వారి ప్రశ్న. ఎప్పుడైనా ఒకసారి పంటల బీమా చెల్లింపు నిబంధనల ప్రకారం రైతుకు వచ్చినా ఆ డబ్బు రైతు దగ్గరికి చేరే సరికి వాస్తవంగా ఎంత సమయం పడుతుందో,ఎన్ని సమస్యలు ఉంటాయో ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూశాము. బ్యాంకు అధికారులు తప్పును బీమా కంపెనీల మీదికి, అవి బ్యాంకుల మీదికి నెట్టేసుకుంటున్నారు. రైతుకు 6 నెలల క్రింద రావలసిన బీమా క్లెయిమ్ ఇప్పటికీ రాలేదు. బీమా పథకాలు ఏ జిల్లాలో, ఏ పంటలకు వర్తిస్తాయి. వాటికి రైతులు ప్రీమియం ఎంత చెల్లించాలి, చెల్లించటానికి చివరి తేదీలు ఎప్పుడు, ఆ భాద్యతలను ఏయే కంపెనీలకు అప్పగించారు వంటి విషయాలతో ఈ సంవత్సరం ఏప్రిల్ 17 తేదిన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై, ఆగష్టులలో తగినంత వర్షపాతం లేకపోవడంతో కొన్ని మండలాలలో వర్షాలు లేకపోవడంతో పత్తి రైతులకు వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.పంట బీమా చెల్లింపులు (క్లెయిమ్) రైతులకి ఎందుకు రావట్లేదు?బీమా నోటిఫికేషన్ వెలువడింది మొదలు అందులోని అంశాల పై జిల్లా, మండలాలలో ఎంతో ప్రచారం జరగవలసి ఉంది. కానీ, వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులకు కూడా దీనిపై పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు. రైతులను భీమా చేయించుకోమని ప్రోత్సహించాల్సిన వ్యవసాయ శాఖ, బీమా కంపెనీలు ఆ పాత్ర సరిగా నిర్వహించటం లేదు. కేవలం కరపత్రాల ముద్రణ వరకే పరిమితం అవుతున్నాయి. అది రైతు వరకు చేరటం లేదు. మన తెలంగాణ – మన వ్యవసాయం, రైతు చైతన్య యాత్ర లాంటి కార్యక్రమాలలో బీమా గురించి విస్తృతంగా ప్రచారం చేస్తే ఎక్కువ మంది రైతులు భీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
రైతులు స్కేల్ అఫ్ ఫైనాన్సు ప్రకారం ఏ పంటకి ఎక్కువ రుణం వస్తే ఆ పంట నమోదు చేసుకోవడం కొన్ని సార్లు జరుగుతోంది. బ్యాంకు అధికారులు చాలా సార్లు రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఏ పంట అయితే వేశారో అదే పంటకు బీమా ప్రీమియం పట్టుకుంటారు. రైతు ఏ పంట వేశారో అన్నది బ్యాంకు ఫీల్డ్ అధికారులు పంట దగ్గరికి వెళ్లి నిర్దారణ చేసుకోవాలి. ఇందుకోసం రైతు ఖాతా నుండి సంవత్సరానికి 500 రూపాయలు కూడా వసూలు చేస్తారు. కానీ, ఇవేమీ జరగకుండానే కేవలం రెవెన్యూ, వ్యవసాయ అధికారుల నుండి పంట నిర్ధారణ పత్రాలు తీసుకురమ్మని ఒత్తిడి తీసుకువస్తారు. తీరా రైతులు పంట నష్టపోయి బీమా వర్తిస్తుందని ఆశించే సమయానికి బ్యాంకులో రుణం పొందిన పంటకు వాస్తవంగా నష్టపోయిన పంటకు సంబంధం లేకపోవటం వల్ల వారికి బీమా చెల్లింపురాదు.బీమా యూనిట్ పంట బీమా సాధారణంగా ఒక ఏరియా (ప్రాంతం) యూనిట్ గా తీసుకుని చేయబడుతుంది. అది ఒక గ్రామం కావచ్చు, ఒక మండలం కావచ్చు, కొన్ని గ్రామాలు కలిపిన ప్రాంతం కావచ్చు. ఆ బీమా యూనిట్లో, అంటే ఆ గ్రామం లేదా మండలంలో ఉన్న రైతులందరికీ సగటున నష్టం కలిగినప్పుడే ఏదైనా చెల్లింపు ఆ రైతులకి వస్తుంది. అంటే సగటున రైతులందరికీ నష్టం కలిగితే, అది ఆ రైతుల చేతిలో లేని కార ణం వలన జరిగిందని నిర్ధారిస్తుంది బీమా పథకం. బీమా మొత్తం లేదా ‘సమ్ ఇన్సూర్డు’ (Sum Insured): ప్రతి పంట లో ఒక ఎకరం లేదా హెక్టారుకి వర్తించే ‘స్కేల్ అఫ్ ఫైనాన్సు’ ఆధారంగా బీమా మొత్తం నిర్ణయిస్తారు.పంటకు అయ్యే సాగు ఖర్చు ఆధారంగా స్కేల్ అఫ్ ఫైనాన్సు మారుతుంది కాబట్టి, దాని ఆధారంగా బీమా మొత్తం కూడా మారుతుంది.బీమా చెల్లింపు లేదా ‘క్లెయిమ్’ ఆయా బీమా యూనిట్లో ‘వాస్తవ దిగుబడి’ని నిర్దారించిన తర్వాత అది ‘కనీస దిగుబడి’ కంటే తక్కువగా ఉంటే అప్పుడు బీమా చెల్లింపు లభిస్తుంది. దానిని ‘క్లెయిమ్’ అంటారు. ఈ చెల్లింపు ఎంత మొత్తం ఉంటుంది? పంట దిగుబడిలో ఎంత లోటు వచ్చిందో దాని ఆధారంగా ఉంటుంది. మొక్క జొన్నకి ఒక గ్రామం యూనిట్లో బీమా మొత్తం ఎకరానికి 20,000 రూపాయలు. సాధారణంగా ఆ గ్రామంలో సగటు దిగుబడి 10 క్వింటాళ్ళు వస్తుంది. ప్రస్తుత పంట కాలంలో వాస్తవ దిగుబడి 7 క్వింటాళ్ళు వచ్చింది. అయితే ఆ గ్రామానికి నిర్ణయించబడ్డ కనీస దిగుబడి 6 క్వింటాళ్ళు అనుకోండి. అప్పుడు ఆ గ్రామంలో రైతులకి ఎటువంటి క్లెయిమ్ రాదు! అలాగే కాక వాస్తవ దిగుబడి 4.5 క్వింటాళ్ళు వచ్చిందనుకోండి. అప్పుడు (6 మైనస్ 4.5) అంటే 1.5 క్వింటాళ్ళు పంట లోటు వచ్చినట్లు. దానికి (1.5/6 x 20,000), అంటే 5,000 రూపాయలు చెల్లింపు వస్తుంది. కనీస దిగుబడి ఎంత నిర్ణయించారు అనేది చాలా ముఖ్యం అని దీని వలన మనకి అర్థం అవుతోంది.కనీస దిగుబడి (త్రెషోల్డ్ యీల్డ్) ఎలా నిర్ణయిస్తారు?
దీర్ఘకాలిక సగటు దిగుబడి: మొదట ఆ బీమా యూనిట్లో గత ఏడు సంవత్సరాలుగా వచ్చిన సగటు దిగుబడి తీసుకోవాలి. దీనికి ప్రతి సంవత్సరం అక్కడ జరిపిన ‘పంట కోత ప్రక్రియ’లో వచ్చిన దిగుబడిని వాడుతారు. అయితే గత ఏడు సంవత్సరాలలో అతి తక్కువ దిగుబడి వచ్చిన ఒకటి లేదా రెండు సంవత్సరాలను మినహాయించవచ్చు. ఈ విధంగా లెక్క వేయడంతో మనకి దీర్ఘకాలిక సగటు దిగుబడి వస్తుంది.ఇండెమ్నిటి లెవల్ (Indemnity level) అంటే గ్యారంటీ దిగుబడి శాతం.దీర్ఘకాలిక సగటు దిగుబడి ప్రతి సంవత్సరం వస్తుందని బీమా కంపెనీ గ్యారంటీ ఇవ్వదు. దానిలో కనీసం 60% లేదా 70% తప్పక వస్తుందని ఒక లెవెల్ ని నిర్ణయిస్తారు. అది ఇండెమ్నిటీ లెవెల్, అంటే గ్యారంటీ దిగుబడి శాతం.కనీస దిగుబడి = (దీర్ఘకాలిక సగటు దిగుబడి x ఇండెమ్నిటి లెవెల్)
పైన చెప్పిన ఉదాహరణలో దీర్ఘకాలిక సగటు దిగుబడి 10 క్వింటాళ్ళు. ఇండెమ్నిటి లెవెల్ 60 శాతం ఉంటే కనీస దిగుబడి 6 క్వింటాళ్ళు. అప్పుడు వాస్తవ దిగుబడి 7 క్వింటాళ్ళు వచ్చిన యూనిట్లో ఏమీ చెల్లింపు రాదు. అయితే ఇండెమ్నిటి లెవెల్ 80 శాతం ఉంటే కనీస దిగుబడి 8 క్వింటాళ్ళు అవుతుంది. అప్పుడు 7 క్వింటాళ్ళు వాస్తవ దిగుబడి వచ్చిన యూనిట్లో రైతులకి (8 మైనస్ 7) అనగా 1 క్వింటాల్ పంట లోటు వచ్చినట్లు. దానికి చెల్లింపు వస్తుంది. ప్రతి సీజన్లో ప్రతి పంటలో ప్రతి బీమా యూనిట్ కి కనీస దిగుబడి ప్రత్యేకంగా పై ఫార్ములా ప్రకారం నిర్ణయించబడుతుంది.
ఆహార పంటలలో రైతు వాటా గరిష్టంగా ఖరీఫ్ లో 2 శాతం, రబీలో 1.5 శాతం మాత్రమే ఉంటుంది. మిరప, పసుపు వంటి వాణిజ్య పంటల్లో గరిష్టంగా 5 శాతం ఉంటుంది. వాస్తవ ప్రీమియం రేట్లు దాని కంటే ఎక్కువ ఉంటే ఆ తేడాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరి సగంగా బీమా కంపెనీలకు నేరుగా చెల్లించాలి.నాన్-లోనీ (బ్యాంకు ఋణం తీసుకోని) రైతులకు బీమా
బ్యాంకు నుండి పంట రుణం తీసుకున్న వారి తరపున తప్పని సరిగా బీమా ప్రీమియంను బ్యాంకు జమ చేస్తుంది. అయితే పంట రుణాలు తీసుకోని రైతులకి కూడా బీమా కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది ఈ పథకంలో ఉంది. ప్రీమియం రేట్ తగ్గించారు కాబట్టి రైతులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాన్-లోనీ రైతులను నమోదు చేయించాలని వ్యవసాయ అధికారులకు (ఎ.ఓ.లకు) టార్గెట్లు కూడా ఇచ్చారు. బీమా ప్రీమియం కట్టడానికి నిర్దిష్టమైన కటాఫ్ (ఆఖరు) తేదీలు: ప్రతి ప్రాంతానికి (జిల్లా లేదా క్లస్టర్), ప్రతి పంటకి ఒక నిర్దిష్టమైన కటాఫ్ తేదీ ఇచ్చారు. ఆ లోపు రైతులు రుణాలు తీసుకున్నప్పుడే వారి బీమా ప్రీమి యం నమోదు అవుతుంది. నాన్-లోనీ రైతులు ఆ తేదీ లోగానే బీమా దరఖాస్తు/డిక్లరేషన్ ఫారం నింపి ప్రీమియం కట్టాలి.విత్తనాలు నాటలేని పరిస్థితి వస్తే దానికి చెల్లింపు బీమా తీసుకున్న తర్వాత వాతావరణ పరిస్థితుల వలన విత్తనాలు నాటలేక పొతే, దానికి కూడా కొంత చెల్లింపు ఉంటుంది. అయితే ఆ లోపు ఆ బీమా యూనిట్లో ఆ పంటకు నమోదు అయిన భూముల్లో 75 శాతం భూమిలో ఈ సమస్య ఎదురయి ఉండాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించి నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికై సీజన్ మొదట్లోనే ఒక కటాఫ్ తేదీని రాష్ట్రప్రభుత్వం ప్రకటిస్తుంది. సాధారణంగా పంట బీమా ప్రీమియం కట్టడానికి ఇచ్చిన కటాఫ్ తేదీకి 15 రోజుల తర్వాత దీనికి సంబంధించిన కటాఫ్ ఉంటుంది.సీజన్ మధ్యలో పెద్ద వైపరీత్యం వస్తే సత్వర చెల్లింపు చెల్లించవలసి ఉన్నది.
సీజన్ మధ్యలో పెద్ద వైపరీత్యం వచ్చి పెద్ద ఎత్తున పంట నష్టం కలిగితే దానికి వెంటనే బీమా మొత్తంలో 25 శాతం దాకా చెల్లింపు లభించే అవకాశం ఉంది. వరదలు, తీవ్ర వర్షాభావం, కరువు వంటి వాటి వలన కనీస దిగుబడిలో 50 శాతం కంటే ఎక్కువ లోటు కలిగే పరిస్థితుల్లోనే ఇది అమలులోకి వస్తుంది. ఇటువంటి పరిస్థితి వచ్చిందని నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం, బీమా కంపెనీతో కూడిన ఉమ్మడి కమి టీ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబడుతుంది. వీరు వర్షపాతం, వాతావరణ రిపోర్టులు, శ్యాటిలైట్ చిత్రాల ఆధారంగా 50 శాతం పైగా నష్టం జరుగుతుందని అంచనా రిపోర్టు తయారు చెయ్యాలి. ఈ రిపోర్ట్ ప్రకృతి వైపరీత్యం వచ్చిన 7 రోజులలోగా ఇవ్వాలి. దాని ఆధారంగా 15 రోజులలోగా బీమా కంపెనీ వారు, ప్రభుత్వ అధికారులు కలిసి ఉమ్మడి ఇన్స్పెక్షన్ (విచారణ) చెయ్యవచ్చు. చెల్లింపు చెయ్యాలని నిర్ణయం జరిగితే నెల రోజులలోగా రైతుల అకౌంట్లో డబ్బు వేయాలి.రైతులు జూన్ మొదటి వారంలోనే పత్తి పంటను వేశారు. బీమా మాత్రం జూలై 15 తేది నుండి వర్తిస్తుంది,అంటే ఈ నలబై రోజుల కాలంలో జరిగిన నష్టానికి బీమా కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదు. దీనికి పరిష్కారంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడాన్ని త్వరగా ప్రారంభించి పంట వేసిన రోజునుండే బీమా పరిధిలోకి వచ్చే విధంగా చూడాలి. మన దగ్గర బ్యాంకులు ఎక్కువ శాతం ఖరీఫ్ పంట రుణాలు మాత్రమే ఇస్తాయి. వాటిని మళ్లీ సంవత్సరానికి రెన్యువల్ చేస్తారు.రబీ లో రుణాలు ఇవ్వటం చాలా తక్కువ కాబట్టి రబీ పంటలకు పంటల బీమా ప్రీమియం కట్టేవారు మరీ తక్కువ. ఈ సమయంలోనే వ్యవసాయ శాఖ,ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రచారం చేసి రైతులు స్వంతంగా ప్రీమియం కట్టే విధంగా పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం (క్లెయిమ్) వచ్చే విధంగా ఉంటే 100% రైతులు పంటల బీమా పరిధిలోకి వస్తారు. ఏది ఏమైనా ఎన్నో సమస్యలతో సతమతమయ్యే రైతులు ఈ పంటల బీమా ప్రీమియం కట్టుకోవటానికి తేదీలు,క్లెయిమ్ వస్తుందా రాదా ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఇంకా కొన్ని ఏళ్ల పాటురైతు పంటల బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి, బీమా కంపెనీల పెత్తనం కొనసాగకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. అవసరం అయితే ప్రభుత్వమే రంగంలోకి దిగి ఈ బీమా వ్యవహారాలు చూసుకోని రైతుకు న్యాయం చేయాలి.