పటేల్ ని చూడాలంటే ఖర్చవుతుంది!!

న్యూఢిల్లీ;
ప్రపంచంలోనే అతి ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి దాదాపు రెండింతలు ఎత్తయిన (182 మీటర్లు) సర్దార్ విగ్రహం మాదిరిగానే దీని రేట్లు కూడా భారీగా ఉన్నాయి. ఉక్కు మనిషి విగ్రహాన్ని రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత నవంబర్ 3 నుంచి సాధారణ ప్రజలు కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు వెళ్లవచ్చు. ఈ విగ్రహాన్ని చూడటానికి పెట్టిన టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి.

విగ్రహంలో రెండు లిఫ్టులు అమర్చారు. ఇవి సర్దార్ హృదయం వరకు వెళ్తాయి. అక్కడి నుంచి చూస్తే సర్దార్ సరోవర్ డ్యామ్ కనిపిస్తుంది. గ్యాలరీని కూడా చూడవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. www.soutickets.in వెబ్ సైట్లో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. వ్యూ గ్యాలరీకి వెళ్లడం, అద్భుత దృశ్యాన్ని చూడటం మధ్యతరగతి వారికి పెను భారమని చెప్పక తప్పదు.

గ్యాలరీ, మ్యూజియమ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వంటి అన్ని దృశ్యాలను చూడాలనుకుంటే మూడేళ్ల పిల్లల నుంచి పెద్దల వరకు అంతా రూ.350 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరో రూ.30 బస్ ఛార్జీలు చెల్లించాలి. అంటే మొత్తంగా ఒక్కొక్కరికి రూ.380 వదుల్తాయి. మీరు సర్దార్ పటేల్ హృదయం (142 మీ.ల ఎత్తు) దగ్గర ఏర్పాటైన గ్యాలరీ చూడనక్కర్లేదనుకొంటే 3-15 ఏళ్ల వరకు పిల్లలకు రూ.60, ఆపైన వయసు ఉన్నవారికి రూ.120 టికెట్ తీసుకోవాలి. బస్ ఛార్జీలు రూ.30 మాత్రం తప్పనిసరి. ఈ టికెట్ తో మీరు విగ్రహం దగ్గరకు వెళ్లవచ్చు కానీ పైకి వెళ్లలేరు. కానీ మ్యూజియమ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడవచ్చు. మ్యూజియమ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడొద్దని అనుకొనేవారు రూ. 30 టికెట్ తో విగ్రహం దగ్గరకు వెళ్లవచ్చు. రూ.30 బస్ టికెట్ తీసుకోవాల్సిందే.