పటేల్, బోస్ సరసన రాకేష్ ఆస్థానా: వైరల్ వీడియో.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
‘ప్రపంచంలోకి ఎందరో ఇలా వచ్చి అలా వెళ్తుంటారు. కొందరు ప్రత్యేక వ్యక్తులు మాత్రమే తమ చర్యల ద్వారా తమదైన గుర్తింపు తెచ్చుకొంటారు. అలాంటి ప్రత్యేక వ్యక్తుల్లో ఒకరి అడుగులు ఎప్పుడూ మంచి మార్గం వైపే నడిచాయి. కర్తవ్య నిష్ఠతో తన హోదాకి గౌరవం ఇనుమడింపజేశారు. తనకు ఎదురైన ప్రతి సవాలుని శ్రద్ధాసక్తులతో, కఠోర శ్రమతో పూర్తి చేశారు. తన భుజాలపై భద్రత బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించారు. ఆయనే మనందరికీ ఇష్టుడైన రాకేష్ ఆస్థానా‘రూ.3 కోట్లు లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా చాలా కాలం క్రితమే తన గురించి ఒక వీడియో తయారు చేయించారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆ వీడియోలోవే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి ఇన్ని ప్రశంసా వాక్యాలు ఉన్న వీడియో ఎప్పడూ చూసి ఉండరు. సింఘం సినిమా స్క్రిప్టు చదివినట్టు ఉంటే అది మీ తప్పు కాదు. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి ఉండే ఈ వీడియోలో రాకేష్ ఆస్థానా స్టైల్ గా కారు ఎక్కుతారు. దిగుతారు. ఫోన్ లో కింది సిబ్బందికి ఆదేశాలు ఇస్తుంటారు. పని చేస్తూ కనిపిస్తారు. ఈ వీడియో ఆయన గుజరాత్ సూరత్ పట్టణానికి పోలీస్ కమిషనర్ గా ఉన్నపుడు తయారైన వీడియో క్లిప్.
వీడియోలో రాకేష్ ఆస్థానా సాహసం, త్యాగం, కార్యనిర్వహణ గురించి ప్రస్తావన వచ్చినపుడు ఆయనతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, స్వామి వివేకానంద చిత్రాలు దర్శనమిస్తాయి. అంటే ఆస్థానా ఆ మహనీయుల సరసన ఉండదగినవాడనే అర్థంలో చూపించారు. ఇప్పుడు లంచం కేసులో సీబీఐ అదుపులో ఉన్న రాకేష్ ఆస్థానా గురించి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.