విప్లవ రచయితల సంఘం కామ్రేడ్ వరవరరావు పై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నాం.

ముంబయి:
ఇది ప్రజాసంఘాలను, ప్రశ్నించే హక్కును అణచేందుకు పన్నిన భారీ కుట్ర. భీమా కోరేగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ దళిత, ఆదివాసీ హక్కుల, ప్రజాసంఘాల బాధ్యుల అరెస్టును నిరసిస్తున్న సమయంలోనే అంతకన్నా కుట్రపూరిత చర్యలకు పోలీసులు తెరతీసారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి అందులో విరసం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వరవరరావు పేరును ఇరికించారు. కోరేగావ్ లో అసలు నిందితులైన సంఘపరివార్ నాయకులను వదిలేసి దళిత సంఘాలు, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్టు చెసి అంతటితో ఆగకుండా దాని కొనసాగింపుగా ఒక కుట్ర కేసును రచించడం ద్వారా ప్రజాసంఘాలను, దళిత ఉద్యమాలను విప్లవ ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణను అణచివేయాలని చూస్తున్నారు. ఇది నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్, బిజెపి శక్తులు రచించిన కుట్ర. ఇలాంటి కుట్ర రచనలు వారికి కొత్త కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు కూడా ఇలాంటిదొకటి జరిగింది.
తమ పట్ల విశాల ప్రజారాశుల్లో వ్యతిరేకత ప్రబలుతున్నపుడు ప్రజల సానుభూతిని పొందేందుకు, ప్రధాన సమస్యలపై దృష్టి మళ్లించేందుకు, పనిలో పనిగా ఉద్యమించే శక్తులను, ప్రశ్నించే గొంతుల్ని అణిచేందుకు పాలకులు తమ చేతుల్లో ఉండే నిఘా విభాగాన్ని, పోలీసు శాఖను ఉపయోగించుకొని ఇలాంటి పనులు చేస్తారు. మోదీపై కుట్ర పెద్ద అబద్ధం. అసలు కుట్ర మోదీ రాజ్యం చేస్తున్నది. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేరక పోగా మరింతగా అది అప్రదిష్ట మూటగట్టుకుంటుంది. ప్రభుత్వం ప్రజలకు బాధ్యతపడటం పోయి కార్పొరేట్లకు నిబద్ధులై అమలు చేస్తున్న విధానాల అసలు రూపు దాచేస్తే దాగదు. మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరేగావ్ మరో మారు అణగారిన ప్రజల ముందు పెట్టింది. అది సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నది. నాగపూర్ నుండి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టవలసిందిగా పజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేస్తున్నది.

-పాణి (కార్యదర్శి), కళ్యాణరావు (సీనియర్ సభ్యులు),
వరలక్ష్మి, కాశిం, రాంకీ (కార్యవర్గ సభ్యులు)