పనిమనుషుల అమ్మకం ప్రకటనకర్తలకు శిక్ష.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
‘అమ్మకానికి పనిమనుషులు’ అంటూ సింగపూర్ లో ఓ కంపెనీ ఇచ్చిన ప్రకటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా మధ్యయుగాల నాటి మనుషుల వ్యాపారం తరహాలో ఈ ప్రకటన ఉందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో కదిలిన సింగపూర్ ప్రభుత్వ యంత్రాంగం ఆ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీపై కఠిన చర్యలు చేపట్టింది. ఇండోనేషియన్ పనిమనుషుల అమ్మకం అంటూ ఆన్ లైన్ ఇచ్చిన ప్రకటనలు చౌకబారుగా ఉన్నాయంటూ ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
‘మెయిడ్.రిక్రూట్ మెంట్’ అనే పేరుతో ఓ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ సింగపూర్ లో ప్రకటనలు గుప్పించింది. అందులో అమ్మకానికి ఇండోనేషియన్ పనిమనుషులు అని పేర్కొంది. కొందరిని ఇప్పటికే అమ్మినట్టు తెలిపింది. ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనను గుర్తించిన సింగపూర్ కార్మిక మంత్రిత్వశాఖ వస్తువుల మాదిరిగా మనుషులను అమ్ముతున్నట్టు ఆన్ లైన్ లో ప్రకటించడం ఆమోదయోగ్యం కాదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. చట్టవిరుద్ధంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నందుకు ఎస్ఆర్సీ రిక్రూట్ మెంట్ అనే ఆ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ కంపెనీ వ్యవహారాలపై లోతుగా దర్యాప్తునకు ఆదేశించింది.