పరువు హత్యల మూలాలెక్కడ?

మానవ జాతి సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి ఈ కులదురంహాకార హత్యలు. ఈ హత్యలు ఆగాలంటే ముందు పాలకుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ప్రజల్లో శాస్త్రీయమైన ఆలోచనలు వెల్లి విరిసేందుకు కార్యక్రమాలు చేపట్టాలి. కుల జాడ్యం వదిలిపోయేందుకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, మహాత్మజ్యోతిరావు పూలే, పెరియార్‌ రామస్వామి నాయకర్‌లు చేపట్టిన కులాంతర వివాహాలను ఊరూరా ప్రభుత్వమే జరిపించాలి.

కులాంతర వివాహాల వల్లే కులం పోతుందని నమ్మిన మహనీయుల పుట్టిన దేశమిది. కానీ, కులవ్యవస్థలో కులనాగు బుసలు కొట్టడం మానట్లేదు. మంథనిలో మధుకర్‌, భువనగిరిలో ప్రవీణ్, రాజేష్‌ ఒకరి తరువాత ఒకరు హత్యకు గురయ్యారు. తాజాగా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే దళిత యువకుని హత్య మరోసారి సజీవంగా ఉన్న కులోన్మాదాన్ని ప్రపంచం ముందుంచింది. ఈ హత్యలను సమాజం, మీడియా ‘పరువు హత్యలు’గా పేర్కొంటున్నాయి. ఇవి పరువు తక్కువ హత్యలే తప్ప, పరువు హత్యలు కావు. కులం కోసం తోటి మనిషిని మట్టుపెట్టే మూర్ఖులకు కొదువలేని దేశం మనది. ప్రణయ్‌ హత్య చెబుతున్న వాస్తవాలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. అగ్రకులాల ఆధిపత్యానికి కిందికులాల యువకులు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఈ దుర్మార్గాలకు మూలాలు ఎక్కడున్నాయో, ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావే చెప్పాడు. పరువే ముఖ్యం తప్ప, కూతురు కాదన్న అతని కరుడుగట్టిన ఆలోచనా ధోరణే ఇందుకు ప్రేరేపించింది. నమ్మించి ఓ నిండుప్రాణాన్ని బలితీసుకోవడం యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.

మారుతీరావుకి ఈ పరువు ప్రతిష్టలు అనే తిరోగమన భావన నరనరాన ఎక్కడం వెనకాల భారత సమాజపు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉంది. కులవ్యవస్థకు రక్షణ కవచంలా నిలిచిన మనుస్మృతిలో ఇలాంటి శిక్షలు అనేకం లిఖించబడ్డాయి. ఒక అగ్రవర్ణ స్త్రీని కన్నెత్తి చూస్తే కళ్లు తీసెయ్యాలి. అదే ఒక అగ్రవర్ణ కులస్తుడు కింది కులాల స్త్రీలను ఏమైనా చెయ్యొచ్చు. అలాగే క్రింది కులాల పురుషులు అగ్రవర్ణ స్త్రీలను పెళ్లి చేసుకుంటే చంపేయాలనే శిక్షలను మనుస్మృతే తరాలుగా బోధించింది. దీంతో తక్కువ కులాల వారు అగ్రవర్ణాల దృష్టిలో అసలు మనుషులే కానట్టు వ్యవహరించడం మొదలైంది. కులవ్యవస్థ ఎంతటి భయంకరమైందో ఈ శిక్షలను చూస్తే అర్థమవుతుంది. అందుకే తరచుగా ఇలాంటి పరువు తక్కువ హత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం మనువాద బ్రాహ్మణీయ భావజాలమే. ఇదే దళితుల పట్ల తీవ్ర ద్వేషాన్ని నింపుతున్నది. తమతో సమానంగా దళితులు చదువుకోవడం ఏమిటి? ఉద్యోగాలు చేయడం ఏంటి? మంచి బట్టలు వేసుకోవడం ఏంటీ అనే ధోరణి అగ్రవర్ణాల్లో లోలోపల రగులుతూనే ఉంది. అందుకే తమ పిల్లల్ని కింది కులాల యువకులు ప్రేమించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే మృగాలుగా మారి కులదురంహకార హత్యలు చేస్తున్నారు.

ఇక, మారుతీరావు కులదురహంకారం వెనుక తెలంగాణ ఫ్యూడల్‌ సంస్కృతి కూడా లేకపోలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ముందు అగ్రవర్ణాలవారు రుద్దిన వెట్టిచాకిరి కింద కిందికులాల ప్రజలు నలిగిపోయారు. ఇది నల్లగొండ జిల్లాలో ఇంకాస్త అధికంగానే కొనసాగింది. ఇక్కడ ఉన్న భూస్వాములు వందలాది ఎకరాలున్న ఆసాములు. దాంతో వారికి దళిత, బహుజనులు మనుషులే కాదు. బడుగు బలహీన వర్గాలను ఇప్పటికీ లెక్కచేయనితనం అడుగడుగునా కనిపిస్తది. కాలం మారినా ఈ అగ్రవర్ణ ఆధిపత్యం మాత్రం రాజకీయ నాయకుల రూపంలో కొనసాగుతూనే ఉంది. అందుకే నల్లగొండ జిల్లాలో నేటికీ నూటికి తొంభై శాతం మంది ఎమ్మేల్యేలు ఒక్క సామాజిక వర్గం నుండే ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కిందికులాలను కేవలం ఓటర్లుగా భావిస్తూ రాజకీయ పార్టీల్లో ఉన్న అగ్రవర్ణాలు, తమ పెత్తనాన్ని పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. దీనికి కొనసాగింపే తాజాగా జరిగిన దళితుడైన ప్రణయ్‌ హత్య. హత్య చేయించింది తానేనని, అందుకు తానేం పశ్చాత్తాప పడడం లేదని, మారుతీరావు బరితెగించేలా చేసింది ఈ ఫ్యూడల్‌ సంస్కృతే. ఒకవైపు తరాలుగా రక్తంలో యింకిపోయిన కులదురహంకారం, మరోవైపు జిల్లా అందించిన ఫ్యూడల్‌ సంస్కృతి ప్రణయ్‌ వంటి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది.

ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సాధారణంగానే అగ్రవర్ణాల్లో కరడుగట్టిన దురంహాకారం ఉంది. దానికి పాలకపరమైన విధానాలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న పాలకులు మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని కాపాడుతుంటే ఊరికో మారుతీరావు పుట్టుకురాక మరేం జరుగుతుంది? తెలంగాణలో దళితులు ఇంకా తొలితరం విద్యావంతులుగానే ఉన్నారు. ప్రణయ్‌ కూడా అట్లా కష్టపడి చదువుకోని, తన కలల్ని సాకారం చేసుకోవాలనుకున్నాడు. కానీ, తనకు ప్రేమించే మనసు ఉండడం వల్ల, అగ్రకులాల అహంకారానికి బలికావాల్సి వచ్చింది. కేరళ వంటి రాష్ట్రాల్లో స్కూలు స్థాయి నుంచే రిజిస్టర్‌లో కులం అనే కాలమ్‌ తొలగించి, తమ విశాల దృక్పథాన్ని చాటుకుంటున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం నెలకో పరువు హత్య మన చీకటి ప్రస్థానాన్ని బట్టబయలు చేస్తున్నది.

గత యేడాది మంథనిలో మధుకర్‌ను హత్య చేసిన హంతకులకు ఇప్పటి వరకు శిక్ష పడ్డదేలేదు. ఒక్క మధుకర్‌ విషయంలోనే కాదు, ఆ తరువాత జరిగిన పరువు హత్యల్లో దోషులకు సరైన శిక్షలు పడలేదు. దీంతో అగ్రవర్ణాల తల్లిదండ్రుల్లో చంపడానికైనా తెగించే క్రూర మనస్తత్వం క్రమంగా సంతరించుకుంటున్నది. ఇది వ్యవస్థ పతనానికి దారి తీస్తున్నది. ఈ కుల దురంహకార హత్యలు కేవలం ప్రేమ-పెళ్లిల్ల విషయంలోనే జరుగడం లేదు. ఉత్తర భారతాన గడిచిన నాలుగేళ్లలో అనేక మంది కిందికులాల యువకుల హత్యలు జరిగాయి. దీనికి అధికార పార్టీల పరోక్ష మద్దతు కూడా ఉంది. మూక దాడుల్లో బలైపోతున్న యువకులు కూడా దళితులు, మైనారిటీలే. ఈ దాడుల వెనుకాల కూడా కులవ్యవస్థ అందించిన మనుస్మృతి భావజాలమే ఉంది. ఈ దాడులకు కొనసాగింపే ప్రణయ్‌ హత్యాకాండ. మానవ జాతి సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి ఈ కులదురంహాకార హత్యలు. ఈ హత్యలు ఆగాలంటే ముందు పాలకుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ప్రజల్లో శాస్త్రీయమైన ఆలోచనలు వెల్లి విరిసేందుకు కార్యక్రమాలు చేపట్టాలి. కుల జాడ్యం వదిలిపోయేందుకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, మహాత్మజ్యోతిరావు పూలే, పెరియార్‌ రామస్వామి నాయకర్‌లు చేపట్టిన కులాంతర వివాహాలు ఊరూర ప్రభుత్వమే జరిపించాలి. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు రక్షణ కల్పించాలి. వారిపైన ఎటువంటి దాడులు జరిగినా కఠిన శిక్షలు అమలు చేయాలి. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మనుషుల మానసిక పరివర్తన ద్వారనే సంఘపరివర్తన సాధ్యమవుతుందని గుర్తించాలి. ప్రేమ వివాహాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే ఇట్లా కులాంతార, మతాంతర వివాహాలు జరిగాయి. అందుకు కారణం కులమతాలు వారికి అడ్డురాకపోవడానికి తోడు, సమాజంలో ఇప్పుడున్నంత వ్యతిరేకత ఎదురుకాకపోవడమే. కానీ, ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతిని సాధిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో ఈ కులహంకార హత్యలు జరుగడం దారుణమైన విషయం. పరువు కోసం హత్య చేయించానంటున్న మారుతీరావు వంటి తండ్రులు ఈ సమాజానికి చీడపురుగు వంటివారు. డబ్బు, కులహంకారంతో ఏమి చేసినా చెల్లుతుందనే ధోరణి మరింత మంది ప్రణయ్‌లను బలితీసుకుంటుంది.బౌద్ధం నడయాడిన నేలన నేడు కుల చాంధసవాదం జడలు విప్పుతున్నది. ప్రేమించడం కింది కులాల సహజ లక్షణమైతే, ఆ ప్రేమను చిదిమేయడం కులదురహంకారుల హక్కుగా మారడం విషాదకరం. ఇది ఇలాగే కొనసాగితే ప్రేమ, మానవత్వం స్థానంలో పగ, ప్రతీకారాలు నెలకొంటాయి. బలైపోతున్న దళిత యువకుల్లో క్రమంగా కసి రగులుకుంటున్నది. తిరగబడే రోజు వస్తుంది. తన తోడును కోల్పోయిన అమృత చెప్పినట్టు కులం లేని రోజు రావాలి. మనుషుల మధ్య అడ్డుగోడలు తొలగిపోయి రేపటి తరాలు తలెత్తుకుని జీవించే పరిస్థితులు రావాలి.

డా. పసునూరి రవీందర్‌.