పర్యటనల్లో భార్యలు.. కోహ్లీ మాటే నెగ్గింది!!!

న్యూఢిల్లీ:
విదేశీ పర్యటనల్లో ఆటగాళ్లు తమ భార్య లేదా స్నేహితురాలితో ఎక్కువ రోజులు కలిసి ఉండేలా అనుమతించాలని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కోరికపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఆటగాళ్లకు కుటుంబ సమయం పెంచే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పద్ధతిని పాటించేందుకు బీసీసీఐ అంగీకరించింది. టీమిండియా ఆటగాళ్లు, సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్‌ పాలకుల కమిటీ మధ్య క్రికెటర్ల కుటుంబ సమయం గురించి చర్చ జరిగినట్టు సమాచారం.ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో భారత ఆటగాళ్లు తమ భార్య లేదా స్నేహితురాలితో రెండు వారాలు మాత్రమే కలిసి ఉండేందుకు అనుమతిస్తున్నారు. దీనిని మార్చి పర్యటన ఆసాంతం తమ భాగస్వామితో ఉండేందుకు అనుమతించాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ, మరికొందరు ఆటగాళ్లు బీసీసీఐని కోరుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు క్రికెట్ పాలక మండలి మధ్య బుధవారం చర్చ జరిగింది. ఈ చర్చల్లో ఈ అంశంపై సీఏ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించారు. ఆటగాళ్లు తమ భార్యలతో ఎంత కాలం ఉండాలన్న విషయాన్ని సీఏ ముందుగా ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘంతో చర్చించి ‘కుటుంబ సమయం’ నిర్ణయిస్తుంది. విదేశీ పర్యటన ఎన్ని రోజులు ఉంటుందన్న దానిపై ఆధారపడి కుటుంబ సమయం నిర్ణయిస్తారు. ప్రపంచకప్‌ 2019కి మాత్రం బీసీసీఐ ప్రస్తుత విధానంలో మార్పు ఉండదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన 2015 ప్రపంచకప్‌ పోటీల్లో సెమీఫైనల్‌ వరకు భార్యలను అనుమతించలేదు. ఇంగ్లాండ్‌లో జరిగే 2019 ప్రపంచకప్‌లోనూ ఇదే విధానం కొనసాగుతుంది.