పర్యావరణమే గొప్ప సంపద -ముఖ్యమంత్రి కేసీఆర్.

హైదరాబాద్:
సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాదాన్యమైనదని… భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో భాగమే ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమమని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు, పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియచేసారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం గుర్తు చేసుకున్నారు. పర్యావరణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రభావం మనపైన కూడా ఉంటుందని, వాటి విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంతగా కాలుష్య కారకాలను వాడకుండా ఉండడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ యేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్లిక్ వినియోగం, పొంచి ఉన్న ముప్పును ప్రధానంగా ప్రచారం చేస్తోందని, నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఎంతగా అవసరం ఉన్నా, దాని వల్ల తలెత్తే దుష్పరిణామాల విషయంలో ఏమరుపాటు వద్దని సీ.ఎం హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనీ, అందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిందనీ, ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలందరికీ కాలుష్య రహిత వాతావరణం, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించే కర్తవ్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆకు పచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే తెలంగాణకు హరితహారం ప్రారంభమైందని తెలిపారు. నాలుగో విడత హరితహారంలో అందరూ పాల్గొనటంతో పాటు, నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.