పాత్రికేయులకు సొంతింటి కల సాకారం :మంత్రి కాలువ శ్రీనివాసులు.

అమరావతి :
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులకు గృహనిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తుది ఆమోద ముద్ర వేశారు.ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జర్నలిస్టులందరికీ గృహాలను సమకూర్చడానికి ప్రస్తుతమున్న రాయితీతో పటు అదనంగా రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణాల్లో గృహనిర్మాణ పథకం పొందే జర్నలిస్టులకు అదనంగా లక్షన్నర రూపాయలు, గ్రామాల్లో జర్నలిస్టులకు లక్ష రూపాయలు అదనపు రాయితీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారని మంత్రి వెల్లడించారు. జర్నలిస్టుల గృహ నిర్మాణానికి నియమ నిబంధనలను రూపొందించేందుకు
నియమించబడిన నలుగురు సభ్యుల కమిటీ పలుమార్లు సమావేశమై తీసుకున్న ప్రతిపాదనలను పాత్రికేయ సంఘాల ప్రతినిధులతో చర్చించి ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేయడం జరిగిందన్నారు. గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ పథకం కింద చేపడుతున్న కేటగిరీల్లో జర్నలిస్టుల అభీష్టం మేరకు వారికి సూచించబడిన అయిదు కేటగిరీల్లో గృహనిర్మాణ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. వీటి కింద వస్తున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలకు అదనంగా పట్టణ ప్రాంతాల్లో లక్షన్నర రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయలు సబ్సిడీని ఇచ్చేందుకు కమిటీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచగా ఆయన ఆమోదం తెలియజేయడాన్ని మంత్రి కాలువ శ్రీనివాసులు, సమాచార శాఖ కమిషనర్ ఎస్. వెంకటేశ్వర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముందుగా రూ. 100 కోట్లు కేటాయించనున్నట్టు ఇటీవల జరిగిన వేసవి కాల శాసనసభ సమావేశాల్లో ప్రకటించారు. దీనికి సంబంధించి పద్దును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కావలసిన చర్యలను తీసుకోవడం జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.