పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం: ఇద్దరి మృతి.

మహబూబ్ నగర్:

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన ఒక ప్రమాదం లో బుధవారం ఇద్దరు మరణించారు.నార్లాపూర్ భూగర్భ పంప్ హౌజ్ లోకి పోయె టన్నెల్ లో బ్లాస్టింగ్ జరిగి 14 మంది కార్మికులు గాయపడినారు, ఇద్దరు కార్మికులు చనిపోయినట్టు చీఫ్ ఇంజనీర్ లింగరాజు సమాచారం ఇచ్చారు. ఈ బ్లాస్టింగ్ కి పిడుగుపాటు కారణమని ఆయన తెలిపినారు. అప్పటి వరకు తీవ్రమైన ఎండగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు తీవ్రమైన గాలి దుమారం లేచింది. పిడుగు పడింది. బ్లాస్టింగ్ కోసం మందు గుండు సామాగ్రి కూరి ఉన్నందున పిడుగు పాటుకు మందు గుండు పేలిపోయింది అని ఆయన తెలిపారు. ఇందులో మానవ తప్పిదం ఏమీ లేదు.ఇది ప్రకృతి వైపరీత్యంగానే పరిగణించాలని ఆయన తెలిపారు.చనిపోయిన, గాయపడిన కార్మికులందరూ బీహారు రాష్ట్రానికి చెందిన వారని , తెలంగాణ నుంచి ఎవరు లేరని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన కార్మికుల పోస్ట్ మార్టం నాగర్ కర్నూల్ హాస్పిటల్ లో జరుగుతున్నదని, పోస్ట్ మార్టం పూర్తి కాగానే వారి శవాలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. గాయపడిన కార్మికులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రికి తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై అవాస్తవాలు ప్రసారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.