పావురాలకి దాణా వేస్తే జైలుశిక్ష!!

బ్యాంకాక్:

పావురాలకి ఆహారం ఇస్తే పుణ్యం అని.. మనసుకి ఆహ్లాదాన్నిస్తాయని కొందరు బహిరంగ ప్రదేశాలలో గింజలు, దాణా వేస్తుంటారు. ఇలాంటి పనులు థాయిలాండ్ చేస్తే జైలుశిక్ష తప్పదు. పావురాలతో బర్డ్ ఫ్లూ, ఇతర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండటంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో పావురాలకు బహిరంగంగా దాణా వేసేవారికి జైలు శిక్ష వేసే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటి వరకు పావురాలను పట్టుకొనేందుకు నానా తిప్పలు పడుతున్న బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ ఈ బెడదకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే పక్షులకు దాణా వేసేవారిని అడ్డుకోవడమే మార్గమని నిర్ణయించింది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నెలల వరకు జైలుశిక్ష, రూ. 55,000 జరిమానా లేదా రెండూ విధించాలని నిర్ణయించింది. పావురాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మనుషులకు త్వరగా వ్యాధులు సోకే అవకాశం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకాక్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు.పావురాలకు ఆహారం వేయడంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో నిషేధం అమలవుతోంది. ముఖ్యంగా ఇటలీలోని ప్రధాన పర్యాటక నగరం వెనిస్ లో పావురాలకు దాణా ఇవ్వడం చట్టవిరుద్ధం. అయితే అక్కడ జైలుశిక్ష విధించరు. బ్యాంకాక్ లో మందిరాలు, మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పావురాలు గుంపులుగా కనిపిస్తాయి. అయితే వీటి వల్ల శ్వాస సంబంధ వ్యాధులు, మెనింజైటిస్ బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు వస్తున్నట్టు గుర్తించారు. ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడ్డ థాయ్ ప్రభుత్వం టూరిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొంది.