పాస్ పోర్ట్ పోగొట్టుకున్న సైనా కాబోయే భర్త.

న్యూఢిల్లీ;

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాబోయే భర్త.. బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. డెన్మార్క్ ఓపెన్‌లో ఆడేందుకు కశ్యప్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్‌డమ్‌లో రాత్రి తన పాస్‌పోర్ట్ పోయిందని, సాయం చేయమంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను ట్విట్టర్‌ ద్వారా కోరారు. కశ్యప్ తన ట్వీట్ లో క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ హిమాంత బిస్వా శర్మ, ప్రధాని నరేంద్ర మోడీలను సైతం ట్యాగ్‌ చేశాడు.’నా పాస్ట్‌పోర్ట్‌ పోయింది. గత రాత్రి ఆమెస్టర్‌డామ్‌లో నా పాస్‌పోర్ట్‌ను పోగుట్టుకున్నాను. డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, జర్మనీలో జరిగే సార్లౌక్స్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉంది. ఆదివారం డెన్మార్క్ వెళ్లేందుకు టికెట్ కూడా తీసుకున్నాను. మేడమ్ ఈ విషయంలో సాయం చేయండి. ఈ వ్యవహారంలో త్వరగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను” అని కశ్యప్ తన ట్వీట్‌లో తెలిపాడు. పారుపల్లి కశ్యప్ పెట్టిన ఈ ట్వీట్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రీట్వీట్ చేసింది.

పారుపల్లి కశ్యప్ ట్వీట్‌పై వెంటనే నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. సాయం కోసం కలవాల్సిన వ్యక్తి ఫోన్‌ నెంబర్‌, ఎక్కడ కలవాలో తెలుపుతూ నెదర్లాండ్స్ భారత రాయభారి వేణు రాజమోని ట్వీట్ చేశారు. తను ఆ వ్యక్తికి కాల్ చేశానని… పాస్‌పోర్ట్ పోతే చేయాల్సిన ప్రాసెస్ వివరించాడని… తమకు సమాచారం అందిస్తూ ఉంటానని కృతజ్ఞతలు చెబుతూ పారుపల్లి కశ్యప్ ట్వీట్ చేశాడు.