పిల్లాడు ఏడ్చినందుకు విమానం దింపేశారు.

న్యూఢిల్లీ;
బ్రిటిష్ ఎయిర్ వేస్ కి చెందిన ఓ విమానంలో భారతీయ ప్రయాణికులకు ఘోర అవమానం ఎదురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన జూలై 23న జరిగినట్టు తెలిసింది. లండన్ వెళ్లేందుకు ఒక భారతీయ కుటుంబం బ్రిటిష్ ఎయిర్ వేస్ కి చెందిన విమానం బీఏ-8495 ఎక్కింది. వాళ్లలో ఒక మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. విమానం ఎగిరేటపుడు ఆ అబ్బాయి బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో విమాన సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమను, తమతో పాటు కొందరు భారతీయులను విమానం నుంచి దించేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. బాలుడి తండ్రి 1984 బ్యాచ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఆయన రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు. తనకు జరిగిన అవమానంపై ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకి ఫిర్యాదు చేశారు. పిల్లాడి ఏడుపు ఆపించేందుకు తన భార్య ప్రయత్నిస్తుండగానే పైలెట్లలో ఒకరు తమను కేకలు వేశారని మంత్రికి రాసిన లేఖలో తెలిపారు. కోపంగా తమ బిడ్డపై అరవడంతో మరింతగా బెదిరిపోయి ఏడిచాడని పేర్కొన్నారు. ఆ తర్వాత మరోసారి అదే వ్యక్తి వచ్చి ఏడుపు ఆపకపోతే విమానంలో నుంచి బయటికి విసిరేస్తానని గట్టిగా బెదిరించినట్టు లేఖలో రాశారు.ఇదంతా జరిగిన తర్వాత విమానాన్ని వెనుకకు మరల్చి విమానాశ్రయంలో దింపేశారు. ఆ కుటుంబాన్ని, వారితో పాటు వారికి మద్దతుగా మాట్లాడిన భారతీయులను దింపేసి వెళ్లిపోయారు. తమ వెనుక సీట్లలో కూర్చున్న కొందరు భారతీయులు బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి పిల్లాడి ఏడుపు మాన్పించేందుకు ప్రయత్నించినందుకు రన్ వేపై విమానం ఆగగానే తమను కిందకు దింపడంతో పాటు పిల్లాడిని బుజ్జగించబోయిన భారతీయులను కూడా బయటికి పంపేశారు.తమ విమాన సిబ్బంది దుష్ప్రవర్తనతో బ్రిటిష్ ఎయిర్ వేస్ చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇలాంటి విషయాలను సీరియస్ గా పరిగణిస్తామని..ఇందులో ఎలాంటి వివక్షకు తావుండదని ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించామని.. బాధిత ప్రయాణికులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు.