‘పీడీపీ’ని చీలిస్తే సలాహుద్దీన్ లు పుడతారు! – మెహబూబా ముఫ్తీ.

శ్రీనగర్:
పీడీపీని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. తమ పార్టీని చీల్చి వేరుపడ్డ వర్గంతో బీజేపీ పొత్తు ప్రయత్నాలను ఆమె తీవ్ర స్వరంతో ఖండించారు. ఇలాంటి చర్యలతో కశ్మీర్ లోయలో కొత్త తరం ఉగ్రవాదం పుట్టుకొస్తుందని.. సయీద్‌ సలావుద్దీన్‌, యాసిన్ మాలిక్ వంటి వారు మరికొందరు తయారవుతారని మెహబూబా హెచ్చరించారు. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే కశ్మీరీలకు భారత ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని తెలిపారు. 1987లో ఢిల్లీ కశ్మీర్‌ ప్రజల ఓటు హక్కు రద్దు చేసినందువల్ల ఎలా ఉగ్రవాదం పెరిగిపోయిందో మరచిపోవద్దన్న ముఫ్తీ, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో కశ్మీర్‌ లోయలో 90ల పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలో తలెత్తే పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. పీడీపీలోని అసమ్మతి ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తెరచాటు ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో మెహబూబా ముఫ్తీ ఆగ్రహిస్తున్నారు.