పుట్ట కు కష్టమే!! కొత్త తారల హడావిడి. ప్రగతిభవన్ అన్వేషణ.

ఏకంగా గులాబీ బాస్ మందలించినా డోంట్‌ కేరన్న రీతిలో తన శైలిని ప్రదర్శించారని పుట్టమధుపై ఆరోపణ.ఆయనపై కేసీఆర్‌ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. గతంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన తమ్ముడు శ్రీనుబాబు వ్యవహారశైలితో పుట్ట మధు స్టైల్ కు తేడా లేదు. బీసీ వర్గానికి చెందిన పుట్టమధుకు ఒకవేళ టిక్కెట్‌ దక్కకపోతే,ఆయన భార్య శైలజకు దక్కే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం ఉంది. పుట్ట మధు స్థానంలో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం ‘ప్రగతి భవన్’ అన్వేషిస్తున్నదంటూ వార్తలు వస్తుండడంతో చల్లా నారాయణరెడ్డి, చందుపట్ల సునీల్‌రెడ్డి, గంట వెంకట్రమణారెడ్డి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇక ‘మిషన్ భగీరథ’ పనుల్లో వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న కల్వచెర్ల గ్రామస్థుడు, పారిశ్రామికవేత్త రేండ్ల సనత్ కుమార్ కు ఫాలోయింగ్ పెరుగుతోంది.

మంథని;
టిఆర్ఎస్ శాసనసభ్యుడు పుట్ట మధుకు పుట్టెడు కష్టాలు వచ్చాయి. ‘కెసిఆర్ కొలతల ప్రకారం పనితీరు సరిగ్గా లేని’ అధికార పార్టీ శాసన సభ్యుల జాబితాపై ఇటీవల మీడియాలో రచ్చ జరిగింది. ఆ జాబితా నిజమో,అబద్ధమూ ఇప్పటికీ స్పష్టత లేదు. ఆ జాబితాలో మంథని మధు పేరు కూడా ఉన్నది. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చవచ్చు, మార్చకపోవచ్చును. అది ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. అయితే కొందరు ఆశావహులు రంగంలోకి దిగి హడావిడి చేస్తున్నారు. మంథని కోసం పార్టీ అధిష్టానం ‘కొత్త అభ్యర్థుల’ అన్వేషణ జరుగుతున్నదంటూ ప్రచారం ఊపందుకున్నది. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి, శ్రీధర్‌బాబు వరకూ ఈ నియోజకవర్గంలో ఒకే కుటుంబపాలన కొనసాగుతున్న క్రమంలో కలిసివచ్చిన తెలంగాణా ఉద్యమం, తెలంగాణా రాష్ట్ర ప్రకటన, ఏకంగా గులాబీబాసే ప్రచారానికి దిగటం వంటివాటితో పుట్టమధు అధికార టీఆర్ఎస్‌ నుంచి గెలవడం చారిత్రాత్మకమైన విషయమే. కానీ… దాన్ని పుట్టమధు నిలుపుకోలేకపోతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆయన నిందల పాలవుతున్నారు. ప్రభుత్వ అధికారులపై, పలు సామాజికవర్గాలపై నేరుగా నోరు పారేసుకోవడం, బెదిరించడం వంటి ఘటనలతో అప్రతిష్ట పాలవుతున్నారు. మిస్టరీగా మిగిలిన కొన్ని హత్య కేసుల్లో మధు పేరు వినరావడం మరో వివాదం. ఏకంగా గులాబీ బాస్ కెసిఆర్ మందలించినా, డోంట్‌ కేరన్న రీతిలో తన శైలిని ప్రదర్శించడంతో పుట్టమధుపై కేసీఆర్‌కు తీవ్ర అసహనమున్నట్టు తెలుస్తోంది. గతంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన బ్రదర్‌ శ్రీనుబాబు వ్యవహారశైలితో కూడా బాగా విసిగిపోవడంవల్లే మంథని ప్రజానీకం పుట్టమధుకు ప్రత్యామ్నాయంగా పట్టం కట్టారు. కానీ ఆవిషయాన్ని మధు మరచిపోయారు.పైగా శ్రీధర్ బాబు లాగానే ‘జులుం’ ప్రదర్శిస్తున్నారని విమర్శలను ఎదుర్కుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ విషయంలో మధు ‘సెల్ఫ్‌ గోల్‌’ కొట్టుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. మంథని నియోజకవర్గం పీవీ నర్సింహారావు ప్రాతినిథ్యం వహించిన్నాటినుంచీ ప్రత్యేకతను సంతరించుకున్న నాటి మంత్రపురిగా పిల్చుకునే నేటి మంథని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు గత కాంగ్రెస్‌ పీరియడ్‌లో దక్కిన ఆదరణతో మంథని పేరు మరింత వినిపించింది. అయితే మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబును ఓడగొట్టడానికి 2014 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ చేయని ప్రయత్నాలు లేవు. శ్రీధర్‌బాబు అనుచరుడిగా ఉన్న పుట్టమధు వివిధ పార్టీలు మారి, ఆతర్వాత అధికార టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం 2014 ఎన్నికల్లో విజయం సాధించడం తెలిసిందే. అయితే బీసీ వర్గానికి చెందిన పుట్టమధుకు ఒకవేళ టిక్కెట్‌ దక్కకపోతే, మధు భార్య శైలజకు దక్కే అవకాశాలు ఉండవచ్చునంటున్నారు. కానీ టిక్కెట్‌ మళ్లీ అదే కుటుంబానికిస్తే ఎవరు ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ పాలనలో తేడా ఏముంటుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యేగానే చేస్తున్న పనులన్నీ ఎమ్మెల్యే భర్తగా ఎందుకు చేయడన్న విశ్లేషణ సాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమారుడు చందుపట్ల సునీల్‌రెడ్డి కూడా మంథని నుంచి తీవ్రంగా టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కమాన్ పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త, ‘మిషన్ భగీరథ’ పనుల్లో మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో పలువురు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన రేండ్ల సనత్ కుమార్ మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో అనూహ్యంగా ‘ఫాలోయింగు’ పెరుగుతున్నది. పుట్ట మధు సామాజిక వర్గమైన ‘కాపు’ కులస్తుడు కావడంతో సనత్ విషయమై రాజకీయవర్గాలలో చర్చ ప్రారంభమైంది. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని కానీ, మంథని నుంచి టికెట్టు కోసం ప్రయత్నిస్తానని గానీ సనత్ స్పష్టం చేయలేదని కలవచర్ల, కమాన్ పూర్ ప్రాంతాల టిఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుడిగా ఉండి ఈమధ్యే కారెక్కిన కాటారం జెడ్పీటీసి చల్లా నారాయణరెడ్డి, కమాన్‌పూర్‌ మాజీ జెడ్పీటీసి గంట వెంకట్రమణారెడ్డి వంటివారు టీఆర్ఎస్‌ టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ టిక్కెట్‌ దక్కని పక్షంలో చల్లా నారాయణరెడ్డి, చందుపట్ల సునీల్‌రెడ్డి, గంట వెంకట్రమణారెడ్డిలాంటి వాళ్లు టీజేఎస్‌, బీజేపి లవైపు చూసే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఈనేపధ్యంలో టీఆర్ఎస్‌ టిక్కెట్‌ ఎవ్వరికి దక్కుతుంది? ఎవరెవరు చివరి నిమిషానికి ఏ పార్టీల నుంచి బరిలోకి దిగనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.