‘పుట్ట’ ను వెంటాడుతున్న పాత కేసులు!!

మంథని:

మంథని టిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును పాత కేసులు వెంటాడుతున్నాయి. 2013 జూన్ నెలలో ఆత్మహత్య చేసుకున్న గుండా నాగరాజు కేసు ఆయనకు చుట్టుకుంటున్నది. ఆకేసులో తన పేరు లేదని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో పుట్ట మధు చెప్పారు. కానీ 2013 జూలై 3 న అప్పటి మంథని ఎస్.ఐ. గా పనిచేసి, ప్రస్తుతం మంథని సి.ఐ. గా ఉన్న నటేష్ గౌడ్ మంథని కోర్టు లో దాఖలు చేసిన పత్రాలలో మధు పేరు ఉన్నట్టు తెలుస్తున్నది. గుండా నాగరాజు ఆత్మహత్యకు పుట్ట మధు కారణమని మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఆరోపిస్తున్నారు. నాగరాజు కేసు పరిశోధన రిపోర్టులో మార్పులు జరిగాయన్నది అయన ఆరోపణ. మొదట నమోదైన సెక్షన్ Alter చేసి 306 IPC క్రింద మార్చారని సతీష్ అంటున్నారు. ”నాగరాజు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిని ఉద్దేశపూర్వకంగానే తప్పించినట్టు అనుమానాలు కలుగుతున్నవి. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు, తనకు రక్షణ కల్పించాలి అని డిజిపికి రమణారెడ్డి ఫిర్యాదు చేశాడు. 2013 లో కేసీఆర్ సభ సందర్భంగా నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ”నాగరాజు కేసులో సాక్షం చెప్పొద్దు” అంటూ పుట్ట మధు తనను బెదిరిస్తున్నట్టు రమణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

2014 ఎన్నికలో మంథని ఎమ్మెల్యే టిక్కెట్ పుట్ట మధుకు ఇవ్వాలంటూ నాగరాజు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర కలకలం చెలరేగింది. నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి 50,000 ఇచ్చి పుట్ట మధు తమను పురిగొల్పినట్టు రమణారెడ్డి చెబుతున్నాడు. నాగరాజు ఆత్మహత్య అనంతరం రమణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తనను హైకోర్టు నుంచి బెయిల్ పై పుట్ట మధు విడుదల చేయించినట్టు కూడా రమణారెడ్డి తెలిపారు. తన పేరిట పురుగుల మందు కొనుగోలు చేసినందున తనను ఆ కేసులో అరెస్టు చేసినట్టు రమణా రెడ్డి తెలిపాడు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు డిజిపికి సమర్పించాడు. కాల్ డేటాతో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీస్ ను డిజిపికి అందజేశాడు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా…. పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పోలీసులు రక్షించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2013లో కరీనంగర్ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుట్ట మధు టిఆర్ఎస్ టికెట్టు ఆశించారు. అందులో భాగంగానే గుండా నాగరాజు అనే వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పారన్నది ఆరోపణ. పుట్ట మధు పథకం పారిందని అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో పుట్ట మధు 2014 ఎన్నికల్లో గెలుపొందారని రమణారెడ్డి అంటున్నాడు.