పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం.

N.venugopal, hyderabad:

మిత్రులారా, ఇవాళ పుణె కోర్టు వాయిదాకు నేను వెళ్లలేకపోయాను గాని భీమా కోరేగామ్ హింసాకాండ – ఎల్గార్ పరిషద్ కేసు గురించి తీవ్రమైన కోపంతో, విచారంతో ఈ నివేదిక మీతో పంచుకుంటున్నాను.ఇవాళ సుధా భరద్వాజ్, షోమా సేన్ లను తప్ప మిగిలిన మిత్రులనెవరినీ కోర్టుకు తీసుకు రాలేదు. గతంలో మే 18న జరిగిన కోర్టు వాయిదాకూ ఇవాళ్టికీ మధ్య విచిత్రమైన పరిణామాలెన్నో జరిగాయి. జూన్ 2018 నుంచి ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ సెషన్స్ జడ్జి కె డి వడనే మే 20 నుంచి జూన్ 2 వరకూ సెలవు మీద వెళ్లారు. అప్పటికే మన మిత్రుల బెయిల్ దరఖాస్తుల మీద మన న్యాయవాదుల వాదనలు, ప్రాసిక్యూషన్ ప్రతివాదనలు అన్నీ ఆయన విని ఉన్నారు. మే చివరి వారంలో బెయిల్ మీద ఆయన తీర్పు చెపుతారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో ఆయన సెలవు మీద వెళ్లడంతో ఆయన తిరిగి రాగానే తీర్పు చెపుతారని ఆశించారు. కాని ఆయన సెలవు నుంచి తిరిగి రాకముందే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జి ఆర్ ఎం పాండే ఇప్పుడు కొత్త జడ్జిగా విచారణ సాగిస్తున్నారు. అంటే బెయిల్ దరఖాస్తుల మీద విచారణ మళ్ళీ కొత్తగా ఈ జడ్జి ముందు మొత్తం మొదలవుతుందన్నమాట! ఇంతకుముందరి జడ్జి ముందర నాలుగు నెలలపాటు జరిగిన వాదనలన్నీ వదిలేసి, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలన్నమాట!!

ఇంతకు ముందు మన మిత్రులు తమ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాల్లో దొరికాయని చెపుతున్న ఆధారాల ప్రతులను (క్లోన్డ్ కాపీస్ అంటారు) తమకు ఇవ్వాలని కోర్టును అడిగారు. దాని మీద వాద ప్రతివాదాలు సాగాయి. నిజానికి నిందితుల మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ ఆరోపణలకు మూలమైన ఆధారాలేమిటో చూడడం, ఆ ప్రతుల్ని పొందడం నిందితుల హక్కు. కాని ప్రాసిక్యూషన్ మొదట అవి ఇస్తానని, తర్వాత ఇవ్వనని, అవి ఇవ్వడం దేశ భద్రతకూ సమగ్రతకూ భంగకరమని మాట మార్చింది. ఈ వాదనలన్నీ అయ్యాక చివరికి మే 18న తీర్పు ఇస్తూ అప్పటి జడ్జి ఆ ఆధారాలు మన మిత్రులకు ఇవ్వవలసిందే అని తీర్పు చెప్పారు. ఆ ఆధారాలు ఇమ్మని పోలీసు దర్యాప్తు అధికారికి, ఫారెన్సిక్ సైన్సెస్ లాబరేటరీ నిపుణుడి ముందు అవి తీసుకొమ్మని నిందితులకు, నిందితుల న్యాయవాదులకు నోటీసులు ఇమ్మని కోర్టు అసిస్టెంట్ సూపరింటెండెంట్ (నాజర్ అంటారు) ను ఆదేశించారు. ఆ పని మే 27న జరగవలసింది. కాని ఆరోజు ఆ జడ్జి సెలవు మీద ఉండడంతో అది ఇవాళ్టికి, జూన్ 4 కు వాయిదా పడింది. కాని ఇవాళ నాజర్ తనకు మరింత సమయం కావాలని అడిగాడట, జడ్జి వెంటనే మూడు వారాలు సమయం ఇచ్చాడట. అలా మరుసటి వాయిదా జూన్ 27 కు పడింది. అన్నీ సక్రమంగా జరిగితే ఆ రోజు ఆ ఆధారాల కాపీలు ఇస్తే, ఆ తర్వాత బెయిల్ వాదనలు మొదలవుతాయన్న మాట!!! అప్పటికి సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, షోమా సేన్, మహేష్ రౌత్ జైలులో 12 నెలల 21 రోజులు గడిపి ఉంటారు.సుధా భరద్వాజ్, వర్ణన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా లు జైలులో 8 నెలల రెండు రోజులు గడిపి ఉంటారు. వరవర రావు జైలులో 7 నెలల పది రోజులు గడిపి ఉంటారు.ఎటువంటి విచారణ లేకుండా,
బెయిల్ రాకుండా,అబద్ధపు ఆరోపణలతో,
కేవలం చట్టవ్యతిరేకమైన, క్రూరమైన, అమానుషమైన తాత్సారం వల్ల
చట్టబద్ధ పాలనా, నువ్వెక్కడ?
‘బెయిలే నియమం, జైలు మినహాయింపు’ అనే సుప్రసిద్ధ సహజ న్యాయ సూత్రం, భారత న్యాయశాస్త్రపు ప్రాతిపదిక ఎక్కడ?