పునరపి పయనం.

ప్రయాణం మళ్లీ మొదలెట్టలేం అనుకోడం పొరపాటు. మొదలెట్టగలం. కాకపోతే, ఇక అక్కడి నుంచి కొత్త వాళ్లుంటారు. పాత వాళ్లుండరు. ఉండకపోతేనే బెటరు. వాళ్ళ గురించి అంగలార్చే కొద్దీ, మెదడు మీద బరువయిన దయ్యాలై కూర్చుంటారు. వాళ్లను స్పష్టంగా వొదొలించుకోడం మంచిది. (ప్రికాషన్: ముళ్ళకంప మీంచి టవెల్ తీసుకున్నట్లు జాగర్తగా వొదిలించుకోవాలి.)

కొత్తగా మొదలెట్టాలనుకుంటున్నారా, నిరభ్యంతరంగా నిర్భయంగా మొదలెట్టండి. నిజానికి, ఎప్పటికప్పుడు అప్పటి గతానికి అతుక్కు పోవడం కన్న, వీలయినన్ని ఎక్కువ సార్లు కొత్తగా, తాజాగా మొదలెట్టడమే మంచిది. పాత వాళ్ళు ఎదురుపడితే, అప్పుడే కొత్తగా పరిచయమైనట్లు, వాళ్ళతో అన్నీ కొత్త మాటలే మాట్లాడండి. వాళ్ళు మొదట కాస్త కన్ ఫ్యూజ్ అవుతారు. మరేం ఫరవాలేదు, ఒకటి రెండు నిమిషాల్లో అలవాటు పడతారు. లేదా తమ ‘పాత’ లోనికి తాము వెళ్లిపోతారు, మీకు కన్పించకుండా. వెదక్కండి వాళ్ళ కోసం. వాళ్ళకు అదే కంఫోర్టబుల్ అయితే అలాగే కానివ్వండి.

మనుషులందరూ మంచి వాళ్ళే. చాల సార్లు తమ మానసిక, భౌతిక అవసరాల కోసం ఏవో కొన్ని వేషాలు వేస్తారు. మీకు కుంచెం చెడుగా, చేదుగా కూడా వుంటారు. చెప్పడానికి వీలుంటే, చెప్పడానికి తగిన భాష మీ దగ్గర వుందనుకుంటే… మీకు కష్టం ఎందుకయ్యిందో చెప్పండి. అది లోకానికి ఎందుకు నష్టకరమో కూడా చెప్పండి. నేరుగా సూటిగా సుత్తి లేకుండా. అదర్వైజ్ వాళ్ళను జస్ట్ మనుషులుగా ప్రేమించడమే; ఆ ప్రేమ/స్నేహం మీ నించి ఏకపక్షం అయినా సరే.

బట్ దీనికి, దీనంతటికీ ఒక ‘సవరణ’. ఒకే ఒకటి. ‘జాగర్తగా వుండు’. ఏమయినా యివ్వు. నమ్మకాన్ని మాత్రం ఇవ్వకు. నిబద్ధుడివి కాకు. నమ్మకాన్ని నటులు ఎప్పుడో సస్పెండ్ చేశారు. (నమ్మకాన్ని సస్పెండ్ చేయడమే నటన). అక్కడ నీకు స్పేస్ లేదు, నువ్వు వాళ్ళయిపోతే తప్ప.

యిక్కడ నమ్మకం దొరుకుతుంది అని బోర్డు రాసి వున్న చోట మీ బండికి పెట్రోల్ కొట్టించాల్సి వస్తే, పోతే పోనీ మరో రూపాయి అనుకుని, కొట్టించండి గాని, నమ్మకంతో మాత్రం కొట్టించకండి.

అంటారు గాని, కేవలం పాజిటివ్ ఎనర్జీ ఎవరి లోనూ వుండదు. నెగటివ్ లేకుండా పాజిటివ్ ఉండదు. మరి ఆ కనిపించని నెగటివ్ ఏమయ్యింది? పాజిటివ్ అనిపించే వాళ్ళలో చాల మంది తమ సారం అయిన నెగటివ్ పార్శ్వాన్ని దాచుకుంటున్న వాళ్ళే. వాళ్ళ పాజిటివ్ అంతా వాళ్ళ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ లో నువ్వు ఇమిడిపోయినంత వరకే. తేడా వొచ్చిందా… నీకు తెలీదు వాళ్ళు కొద్ది కొద్దిగా నిన్ను చంపేస్తున్నారని. చనిపోయాక పై నుంచి చూస్తే తెలుస్తుంది.

అప్పుడు కూడా దిగులు వొద్దు.
ఎంచక్కా తిరిగి పుట్టడమే.
మళ్లీ మొదలెట్టడమే.

ఇవాళ జులై నాలుగు రాత్రి. అమెరికన్ల స్వాతంత్ర్య దినోత్సవం.

అమెరికా అంటేనే నిత్య వలసల గాథ.

అమెరికాలో వున్న భారతీయులందరూ వలస వచ్చిన వాళ్ళే. ఇండియాలో వున్న వాళ్ళలో చాల మంది ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళే. (పంకజ్ ఉదాస్ పాట ఒక సెంటిమెంటల్ ఎక్సర్సైజు). ఆమాటకొస్తే, హైదరాబాదులో, విజయవాడలో వున్న తెలుగు వాళ్ళలో అత్యధికులు అక్కడికి వలస పోయిన వాళ్ళే. హైదరాబాదు లోని తెలంగాణేతరులు మరీను.

అలా కాదు. నిజంగా వలస దుఃఖం అనుభవిస్తోంది… పాలస్తీనియన్లు, ఆప్రికన్లు, మెక్సికన్లు. (పది పన్నేండేళ్ళ క్రితం నేను అనువదించి ‘ప్రాణహిత’లో అచ్చువేసి, తిరిగి నా 2017 కవితా సంపుటి ‘ఆకుపచ్చ వెన్నెల’లో చేర్చిన అరబిక్ కవి అడోనిస్ కవిత…. ‘వలస’ అనే దీర్ఘ కవితను వీలు చేసుకుని చదవాలని నా ఎఫ్ బీ మిత్రులకు విజ్ఞప్తి). అది వలస. మనుషుల రెగ్యులర్ మొబిలిటీని ‘వలస’ అనడం… వలస దుఃఖం లోని తీవ్రతను తగ్గించి, దాన్ని అవహేళన చెయ్యడమే అవుతుంది.

పల్లెటూళ్లో చిన్ని అధారం వొదులుకుని, నిరక్షరాస్య తలిదండ్రుల నుంచి ఎలాంటి నాగరిక ‘సంస్కారం’ నేర్వకుండా వొచ్చి ఈ డాలర్ వేటగాళ్ళతో పోటీ పడాల్సిన వాళ్ళది మరో అదనపు దుఃఖం. ఇక్కడ వాళ్ళకు ఒక వాయిస్ కూడా వుండదు, దానికి కారణం ఇక్కడి స్పేసెస్ ని రకరకాలుగా, పుట్టగొడుగు సంఘాలుగా కబ్జా చేసిన వెస్టెడ్ ఇంటరెస్టులు, కుల మతాల ప్రచ్చన్న ఖడ్గాలూ, డాళ్లూ.

ఇక్కడికంటూ వొచ్చిన వాళ్ళలో దాదాపు అందరూ ఏదో విధంగా ఇండియాలో ‘అడ్వాంటేజ్ద్ పోజిషన్స్’లో వుండి వొచ్చిన వాళ్ళే. అప్పటికే ఎన్ లైటెండ్ టీచర్స్ ఎటెసెటరా కొడుకులే. (కూతుళ్లు తక్కువ). వీళ్లు ఇక్కడికి వొచ్చి, తాము నిమ్న కులజులమని గారాలు పోవడం అర్థ రహితం. ఆ చైతన్యం నిజంగా వుంటే ఇండియాలో బీసీల కోసం. దలితుల కోసం ఎంత చేయగలిగితే అంత చేయాలి. ఆ పనిలో కలిసి రాని వాళ్ళను సహేతుకంగా విమర్శించాలి.

అమెరికాకు వొచ్చారు. తప్పేం కాదు. రూపాయల వేట కన్న డాలర్ల వేట ఎక్కువ హీనం కాదు.

గ్రీన్ కార్డు తీసుకున్న నా బోటి డిపెండెంట్స్ నుంచి, ఇక్కడి ఓపెన్ సమాజపు సౌకర్యాల వల్ల హుందాగా జీవిస్తున్న సాఫ్ట్ వేర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరూ… సిటిజెన్షిప్ తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలని వుబలాట పడుతున్న వాళ్ళు, రాదేమోనని బయపడుతున్న వాళ్ళు అందరూ… సంతోషంగా అమెరికన్లే. దుఃఖంగా కాదు, సంతోషంగా.

ఇప్పుడే అరగంట క్రితం మా అన్య తల్లి (ఆజన్మ అమెరికన్) లాక్కెలితే, వెల్లి బయట ఇరుగు పొరుగుల ఫైర్ వర్క్స్ చూశాను. జులై నాలుగు పటాసులు. ఇదిగో వాళ్లు కాల్చిన బాణా సంచా ఫోటో. 🙂

అమెరికా లో వున్న అన్ని జాతుల వారికి,
నిజమైన వలస దుఃఖం లో వున్నవారికి మరీనూ…
అమెరికా దినోత్సవ శుభాకాంక్షలు.
చనిపోయిన రీగన్లను, పాలిస్తున్న ట్రంపులను అధిగమించి అమెరికా బాగుండాలి.

10 పి ఎం, 4, జులై.

హెచ్ఛార్కె.