పురుషుల్లో తగ్గిన సంతానోత్పత్తి సామర్థ్యం.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

పశ్చిమ ప్రపంచం పెద్ద ప్రమాదం ఎదుర్కొంటోంది. యూరప్, అమెరికా పురుషుల్లో ఏటా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఇది ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందంటే యూరప్, అమెరికాలలో ప్రతి ఏడాది 1,24,000 మంది పురుషులు ఫెర్టిలిటీ క్లినిక్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏటికేడాది ఈ దేశాల పురుషుల్లో శుక్ర కణాల నాణ్యత 2% తగ్గుతున్నట్టు గుర్తించారు. ఇన్నాళ్లూ స్పెర్మ్ డోనర్లుగా ఉన్న 2,600 మందిలో కూడా ఇదే లోపాన్ని గుర్తించారు. రసాయనాలు, ఆధునిక జీవన విధానం ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. ఈ కారణంగా చాలా మంది పురుషులకు వృషణాల కేన్సర్ సోకుతోందని తెలిపారు. ఆధునిక జీవన విధానం, రసాయనాల వినియోగం కారణంగా చాలా మంది పిల్లలు.. ఒకటి లేదా రెండు వృషణాలు లేకుండా పుడుతున్నారని చెప్పారు. కొందరి టెస్టోస్టిరాన్ స్థాయిల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు కనిపించాయి.ప్రస్తుతానికైతే సంతానోత్పత్తి లోపానికి చికిత్స పొందుతున్న చాలా మంది పురుషులు తండ్రులు కావచ్చు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం భవిష్యత్తు ఊహించడానికే భయమేస్తోందని అంటున్నారు. ఇలా వీర్యం నాణ్యత తగ్గుతూ పోతే ఒకానొక దశలో మానవ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకు గణాంకాలను రుజువుగా చూపిస్తున్నారు. 1973తో పోలిస్తే 2011 నాటికి పశ్చిమ దేశాల్లో శుక్రకణాల సంఖ్య 59% పడిపోయింది. దీనికి విచ్చలవిడిగా క్రిమిసంహారక మందుల వినియోగం, హార్మోన్ల పనితీరుని ప్రభావితం చేసే రసాయనాల వాడకం, ఒత్తిడి, పొగ తాగడం, ఊబకాయం ప్రధాన కారణాలుగా గుర్తించారు. విపరీతంగా మద్యం సేవించడం, కెఫీన్, ప్రాసెస్డ్ మాంసం వినియోగం, ప్లాస్టిక్ వస్తువులను వంగేలా చేసేందుకు, నిప్పు అంటుకున్న కాలిపోని ఫర్నీచర్ కోసం వాడే రసాయనాలు మొక్కలు, జంతువుల ద్వారా మనుషుల శరీరంలో చేరి సంతానోత్పత్తిని దారుణంగా దెబ్బ తీస్తున్నాయని గుర్తించారు.