పూర్తయిన సర్పంచ్ పదవి.

  • షురూ అయిన స్పెషల్ ఆఫీసర్ పాలన.

హైదరాబాద్:
పల్లెల ప్రగతి ప్రధాన లక్ష్యంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల విధులు ఖరారయ్యాయి. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నిధులను ఏయే అంశాలకు ఏమేర ఖర్చు చేయాలనేది నిర్దేశించారు. గ్రామాల పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోయింది. ఐదేండ్లపాటు అధికారంలో కొనసాగిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమ విధులకు వీడ్కోలు చెప్పారు. బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయ్యింది. రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేవరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో ప్రత్యేకాధికారుల నియామకం అనివార్యమయింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేకాధికారుల పాలనను అమలు చేస్తూ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. ప్రత్యేకాధికారుల విధులను ఖరారుచేశారు. గ్రామపంచాయతీల నిధులను వినియోగించడంపై మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిధుల వినియోగాన్ని ఆరు విభాగాలుగా వర్గీకరించారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీ నిధుల్లో 30 శాతం పంచాయతీ కార్మికుల జీతభత్యాల కోసం వినియోగించాల్సి ఉంటుంది. నీటి సరఫరా కోసం 15 శాతం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం 15 శాతం, వీధి దీపాల నిర్వహణ కోసం 15 శాతం, అంతర్గత రోడ్ల మరమ్మతుల కోసం 20 శాతం నిధులు ఉపయోగించాలి. గ్రామ పంచాయతీ సమావేశాలు, ఇతర ఖర్చుల కోసం 5 శాతం నిధులు వాడుకునే విధంగా ప్రభుత్వం నిబంధనలు విధించింది. పంచాయతీల్లో ప్రత్యేకాధికారులకు ప్రధానంగా 14 విభాగాల విధులను నిర్వహించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో పరిశుభ్రత పాటించడం, నూతన నిర్మాణాలకు అనుమతులు, కొత్త ఇండ్లకు ఇంటి నంబర్ల కేటాయింపు, ట్రేడ్ లైసెన్సులు, దుకాణాలు, ఇతర వాణిజ్య, వ్యాపార అనుమతులు జారీచేయడం, జనన, మరణ ధ్రువీకరణ రికార్డులు నమోదుచేయడం, వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీచేయడం, గ్రామ రికార్డులు అప్‌డేట్ చేయడం, తాగునీటి పైపులైన్ల లీకేజీలు అరికట్టడం, మోటర్ల మరమ్మత్తులు, గ్రామాల్లో మార్కెట్లు, ఉత్సవాలు, జాతర సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలు, వ్యాపార సముదాయాల నుంచి పన్నులు వసూలు చేయడం, ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం ప్రత్యేకాధికారుల విధుల్లో ప్రధానమైనవి. ప్రతి 15 రోజులకోసారి వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా గ్రామ పంచాయతీ సమావేశం, రెండునెలలకోసారి గ్రామసభ నిర్వహించడం విధుల్లో భాగమే. గ్రామాల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, వీధి దీపాల నిర్వహణ, గ్రామాల రోడ్లు, అంతర్గత రోడ్ల మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాలి. గ్రామాల్లో వివాదాలకు తావులేకుండా శాంతి పరిరక్షణ, స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడం ప్రత్యేకాధికారుల విధులుగా పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్ చట్టం 2018ని అనుసరిస్తూ ప్రత్యేకాధికారుల విధులను ఖరారు చేశారు. ఈ చట్టంలో తీసుకువచ్చిన మార్పులను ముందుగా ప్రత్యేకాధికారుల నుంచే అమలు చేయిస్తున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం నుంచి గ్రామాల అభివృద్ధి, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడం వరకు ప్రత్యేకాధికారులు చేయాల్సి ఉంటుంది. ప్రతి మండల స్థాయి అధికారికి ఓ గ్రామాన్ని అప్పగించారు. ఒక్కో గ్రామానికి ఒక్కో స్పెషలాఫీసర్ నియమితులయ్యారు. వీరికి గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి, కారోబార్, బిల్ కలెక్టర్లు, వీఆర్వో, వీఆర్ఏలు సహాయకులుగా వ్యవహరించనున్నారు. హరితహారం, స్వచ్ఛత విషయాలను కీలకమైనవిగా అప్పగించారు. ఈసారి గ్రామాల్లో గిరిజనులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమాన్ని కూడా ప్రత్యేకాధికారులకు అప్పగించారు. వీరికి గ్రామపంచాయతీకి చెందిన నిధులు కొంతమేరకు వినియోగించుకునే అవకాశాన్ని సైతం కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి నెలా పంచాయతీలో సమావేశం నిర్వహించాలని, రెండునెలలకోసారి గ్రామసభ నిర్వహించి, గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామస్థులకు వివరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కొత్త చట్టం అమలు తప్పనిసరి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధలను కచ్చితంగా పాటించాలని సూచించారు. గ్రామపంచాయతీ రికార్డులను ప్రతిరోజూ పరిశీలించాలని విధుల్లో పేర్కొన్నారు. గ్రామ కమిటీ తీర్మానాలను పరిశీలించి, వాటిని అమలుచేసే బాధ్యత స్పెషలాఫీసర్‌దే. గ్రామపంచాయతీ అధికారులు, ఉద్యోగులందరిపై నియంత్రణ కలిగి ఉండాలి. ప్రతి పంచాయతీ పరిధిలో పబ్లిక్ రోడ్లు, వంతెనలు, వాటి కింద కాల్వలు, రోడ్ల కట్టలు, అలుగు వంతెనల నిర్మాణం, మరమ్మత్తుల నిర్వహణ, పబ్లిక్ రోడ్లు, పబ్లిక్ స్థలాల్లో వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలి. తాగునీటి పైపులైన్ల నిర్మాణం, నిర్వహణ, మురుగుకాల్వల్లో మురుగు నీరు తొలగింపు, రోజువారీగా వీధులను శుభ్రంచేయడం, చెత్తకుప్పలు, అడవిమొక్కలు, నాగజెముడు తొలగించడం, పాడుబడ్డ బావులను, అపరిశుభ్రమైన కుంటలను, మడుగులను, గోతులను, గుంటలను, ఎత్తుపల్లాలను శుభ్రపరచడం, సరిచేయడంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు, పబ్లిక్, ప్రైవేట్ టాయిలెట్లను శుభ్రంచేయించే బాధ్యత ప్రత్యేకాధికారులదే. దహన, ఖననవాటికల ఏర్పాటు చూడాల్సి ఉంటుందని విధుల్లో పేర్కొన్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటా చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం, డంపింగ్‌యార్డుల నిర్వహణతోపాటు చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మార్చడం గ్రామాల్లోనే చేపట్టాలని వివరించారు. గ్రామాల్లో కచ్చితంగా చెత్త నిల్వచేసే జాగాను గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పంచాయతీ నిధుల కింద చెత్తతో ఎరువుల తయారీ నిర్వహణ మరో బాధ్యత. పంచాయతీ పరిధిలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పశుసంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లతోపాటు ప్రభుత్వ సంస్థలన్నింటా పచ్చదనం, పరిశుభ్రత నిర్వహించాలి. ప్రతి 15 రోజులకోసారి లార్వా నిర్మూలన చర్యలతో దోమల నియంత్రణ, ప్రతివారం కాల్వల శుద్ధి, ప్రతిరోజూ రోడ్లను ఊడ్చడం, మట్టికుప్పలను తొలగింపు, పాత బావులు, బోర్ల గుర్తింపు, వినియోగంలోని లేనివాటిని మూసివేయించడం ఇతర బాధ్యతలు. రోడ్లు, మురుగుకాల్వలు, ఇతర పబ్లిక్ స్థలాల్లో చెత్తను వేస్తే రూ.500 జరిమానా విధించే అధికారం ప్రత్యేకాధికారులకు కల్పించారు. మార్కెట్ల పరిధిలో దుకాణాలు, గ్రామాల్లోని వాణిజ్య, వ్యాపారాలకు ధ్రువీకరణ పత్రాల జారీ అధికారం వీరిదే. పన్నులు వసూళ్లు చేసి ఖజానాలో సమర్పించాలి. గ్రామపంచాయతీ వాటాను సవివరింగా రికార్డుల్లో సూచించాల్సి ఉంటుంది.గ్రామాల్లో నివేశన స్థలాలు, ఖాళీస్థలాలు, రోడ్లను, పబ్లిక్ ప్రాంతాలకు అక్రమిస్తే వాటికి జరిమానా వేసే అధికారం ప్రత్యేకాధికారులకు లభించాయి.గ్రామపంచాయతీ మేనేజ్‌మెంట్ కింద ధర్మాదాయం, ట్రస్టుల నుంచి నిధులు సేకరించడం, సర్వీసు ఇనాములపై శిస్తు వసూలుచేయడం, మత్స్య క్షేత్రాల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు వసూలు చేయడం, పెద్ద తరహా ఖనిజాలు, చిన్న తరహా ఖనిజ వ్యాపారాలు, వాటి తవ్వకాలపై సీనరేజీ వసూలుచేయడం, పోరంబోకు భూముల నుంచి వచ్చే ఆదాయం, ప్రభుత్వ ఆస్తి, కౌలు రూపంలో పన్నులను వసూలు చేసి గ్రామాభివృద్ధికి వినియోగించాల్సిన బాధ్యత స్పెషలాఫీసర్లపై పెట్టారు. గ్రామపంచాయతీకి సంబంధించిన ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీల్లో జమ చేయాలని, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, 13వ ఆర్ధిక సంఘం నిధులు, బీఆర్జీఎఫ్, ఇతర ప్రభుత్వ నిధులు ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీకి సంబంధించిన వేతనాలు, ఇతర ఖర్చులను సూచిస్తూ నిధులు విడుదల చేసుకునే అధికారం ప్రత్యేకాధికారులకు కల్పించారు. గ్రామపంచాయతీలు గతంలో ఏ సంస్థలకైనా అప్పు ఉంటే వాటిని చెల్లించే అవకాశం కల్పించారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి తప్పనిసరిగా చేయాల్సిన పనులకు పంచాయతీ నిధులు వినియోగించుకోవచ్చు. గ్రామపంచాయతీ, ప్రభుత్వ అనుమతితో పంచాయతీ నిధులను దేశ రక్షణ నిమిత్తం ఎలాంటి నిధికైనా కేటాయించే అధికారం ప్రత్యేకాధికారులకు ఉంటుంది. పబ్లిక్ ప్రదర్శన, ఉత్సవాల నిర్వహణ, గ్రామ ప్రజల వినోదం కోసం పంచాయతీ నిధులను వ్యయం చేయవచ్చు. ధర్మనిధికి, పేదలకు, అనాథలకు, నిరుపేదలకు, వ్యాధిగ్రస్థులకు సహయం చేసే వీలు కల్పించారు. వీరికి అండగా ఉండేందుకు ఏదైనా సంస్థ ముందుకు వస్తే ఆ సంస్థకు వ్యయం కోసం పంచాయతీ నిధులను వినియోగించవచ్చు. ప్రభుత్వ నిధులు, ఆర్థిక సంఘం నిధులు, బీఆర్జీఎఫ్, ఇతర ప్రభుత్వ నిధులను ప్రభుత్వ నియమ నిబంధనలను మేరకు వెచ్చించేందుకు స్పెషలాఫీసర్లకు అనుమతిచ్చారు.