పూర్తిగా చాక్లెట్ తో తయారైన కాటేజీ.

పారిస్;
‘హోమ్ స్వీట్ హోమ్’ అనేది ఉత్తుత్తి మాట కాదు.. అక్షరాలా నిజమని నిరూపించారు ఫ్రాన్స్ దేశస్థులు. నోట్లో వేసుకుంటే తియ్యగా కరిగిపోయే చాక్లెట్ ని గోడలు, పైకప్పు, ద్వారాలన్నిటికీ వాడుతూ ఒక కాటేజీని నిర్మించారు. రాజధాని ప్యారిస్ కి నైరుతి శివార్లలోని సెవ్రెస్ లో ఈ చాక్లెట్ ఇంటిని కట్టారు. ఫ్రాన్స్ లో ప్రముఖ చాక్లెట్ తయారీదారుడైన జీన్ లుక్ డెక్లూజూ ఈ చాక్లెట్ కాటేజీని డిజైన్ చేసి నిర్మించాడు. ఈ కాటేజీలోని ప్రతీది చాక్లెట్ తో తయారైనదే. గోడలు, పైకప్పు,నిప్పుగూడు, గడియారాలు, పుస్తకాలు, ఆఖరికి పైకప్పుకి వేలాడే షాండ్లీయర్ కూడా నికార్సైన చాక్లెట్ తో తయారుచేశారు. ఇవే కాదు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన పూల పాన్పులు, బాతులు విహరించే చిన్న కొలను నిర్మాణానికి కూడా చవులూరించే చాక్లెట్ నే ఉపయోగించారు. వింటుంటేనే నోరూరిపోతోంది కదూ.. నిజమే మరి చాక్లెట్ ఒక్క ముక్క నోట్లో వేసుకుంటేనే ఎంతో ఆనందం. అలాంటిది కంటికి కనిపించే ప్రతీది చాక్లెట్ అంటే అబ్బురమే కదా. ఈ చాక్లెట్ కాటేజీలో ఇంకో విశేషం ఉంది. ఇది చూసేందుకు మాత్రమే నిర్మించిన చాక్లెట్ కాటేజీ కాదు. ఇందులో మీరు బస చేయవచ్చు కూడా. ప్రముఖ హోటల్ రిజర్వేషన్ వెబ్ సైట్ బుకింగ్.కామ్ ప్రకారం ఈ చాక్లెట్ కాటేజీలో బస చేయాలనుకొనేవారు ఎవరైనా అక్టోబర్ 5, 6 తేదీల్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రాత్రి గడపడానికి వచ్చేవారికి చిరకాల అనుభూతి మిగిల్చే ఆకర్షణీయమైన ప్యాకేజీ కూడా ఉంది. మీకు నచ్చినట్టు చిన్న చిన్న చాక్లెట్ ఇళ్లు ఎలా తయారు చేసుకోవచ్చో నేర్పిస్తారు. ఆవరణలో ఏర్పాటు చేసిన చాక్లెట్ పూల తోటలో భోజనం వడ్డిస్తారు. పసితనంలో చాక్లెట్లు తింటూ చాక్లెట్ ఇల్లు ఉంటే ఎంత బాగుండు అనుకొనే కల కళ్ల ముందు నిజంగా నిలబడటంతో ఈ చాక్లెట్ కాటేజీ ఫోటోలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.