పృథ్వీషా మరో అరుదైన ఘనత. భారత్ తరపున ఒకే ఒక్కడు.

హైదరాబాద్:

టీమిండియా ఓపెనర్ పృథ్వీషా మరో అరుదైన ఘనత సాధించాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌట్ అయిన విండీస్ భారత్ ముందు 72 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసిన ఓపెనర్ పృథ్వీషా మరో అరుదైన ఘనత సాధించాడు. చివర్లో ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించి పెట్టాడు. భారత్ తరపున విన్నింగ్ షాట్ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా షా రికార్డులకెక్కాడు. 18 ఏళ్ల 339 రోజుల వయసులో ఫోర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కులలో షా రెండో వాడు. ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ 18 ఏళ్ల 198 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు.