పెద్దపల్లి తొలి సర్పంచ్‌ కన్నుమూత…

-రాష్ట్రపద్మశాలి సంఘంలో కీకం
-తెంగాణ పోరాటంలో జైల్లో 75 రోజు

విశ్వనాధ్‌, కరీంనగర్‌ :
పెద్దపల్లి తొలి సర్పంచ్‌ వేముల రమణయ్య (96) బుధవారం కన్నుమూసారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంలో కీలకపాత్ర పోషించిన వేముల రమణయ్య 1964 నుంచి 1981 వరకు పెద్దపల్లి సర్పంచ్‌గా కొనసాగారు. వరుసగా మూడు సార్లు సర్పంచ్‌గా ఎన్నికైన రమణయ్య 1949లో జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. పీవీ నర్సింహరావుతో కలిసి చాందా క్యాంపులో శిక్షణ పొందారు. ఆ తర్వాత చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా సమితిలో కార్యకర్తగా పనిచేసి 75రోజుల జైలు జీవితం అనుభవించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అయనను ఘనంగా సత్కరించింది. ధర్మారం మండలం వనపర్తి గ్రామానికి చెందిన వేముల రమణయ్య తండ్రి మల్లేశం పోలీసు పటేలుగా పనిచేస్తూ పెద్దపల్లికి వలస వచ్చారు. పెద్దపల్లిలో పలు వ్యాపార సంస్థలను నిర్వహించారు. అడ్తి వ్యాపారంలో ఆరితేరిన రమణయ్య హమాలీ సంఘాన్ని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షునిగా కొనసాగారు. పెద్దపల్లిలో క్రికెట్‌ ఆటను ఆయనే ప్రారంభించినట్లు చెప్తున్నారు. జూనియర్‌ కాలేజి ఏర్పాటుకు స్వంతంగా రూ.25వేలు పట్టణ ప్రజల నుంచి సేకరించి పివీ నర్సింహారావు సహాయంతో పెద్దపల్లికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తెచ్చేందుకు విశేష కృషి చేశారు. రాష్ట్రంలోని పద్మశాలి సేవా సంఘానికి ఆయన సహకారాన్ని మరవలేనిదని బుధవారం పెద్దపల్లిలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నవారు ఆయన సేవను గుర్తుచేసుకున్నారు.