పెద్ద నోట్ల రద్దు భూటాన్ కు ఎరుక.

న్యూఢిల్లీ:
పెద్ద నోట్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు భూటాన్ అనుమానిస్తున్నది. భారత కరెన్సీ నోట్లను దాచుకోవద్దని తమ పౌరులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఒక ‘అలర్ట్ ‘ కూడా జారీ చేసింది. పెద్ద నోట్లు దాచుకోవద్దని, బ్యాంకుల్లో జమ చేయాలని రాయల్ మానిటర్ అథారిటీ కోరింది. తమ సూచనను పెడచెవిన పెడితే తదనంతర పరిణామాలకు తమది బాధ్యత కాదని గట్టి హెచ్చరిక కూడా చేసింది. భారత కరెన్సీపై భూటాన్ కి చెందిన ఆర్ఎంఏ తమ దేశ పౌరుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగించింది. భూటాన్ పౌరులెవరూ కొత్త రూ.500 నోట్లను రూ.25,000 కంటే ఎక్కువగా దాచిపెట్టవద్దని తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తమ విధానాలలో మార్పు చేసినా, భారత ప్రభుత్వం మరోసారి పెద్దనోట్లు రద్దు చేసినా చిక్కుల్లో పడతారని చెప్పింది. పాత రూ.500 నోట్లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 2016, నవంబర్ 8న భారత్ పెద్ద నోట్లు రద్దు చేసినపుడు భూటాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆర్ఎంఏ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.