పెనుతుఫానుగా కొనసాగతున్న ‘తితలీ.

విశాఖపట్నం:
జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద గురువారం తెల్లవారుజామున తితలీ తుఫాను తీరం దాటినప్పటికీ పెనుతుఫానుగానే కొనసాగుతోంది. ఈశాన్య దిశగా కదిలి తుపానుగా రేపటికి బలహీనపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళంలో గంటకు 135-145 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో 6 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, రైల్వేలైన్లకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో కళింగపట్నంలో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టులలో ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొవద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.