పెరగనున్న మొబైల్ ఛార్జీలు.

హైదరాబాద్:
రెండేళ్ల క్రితం టెలికాం మార్కెట్లో ప్రవేశిస్తూనే రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వస్తూనే ఉచిత వాయిస్ కాల్స్, కారుచౌకగా నాణ్యమైన 4జీ డేటా వంటి సేవలు అందించి మిగతా పోటీదారులను చావుదెబ్బ తీసింది. జియో దెబ్బకు డేటా నుంచి విపరీతమైన ఆదాయాన్ని ఆర్జించిన మిగతా టెలికాం కంపెనీలు కూడా తప్పనిసరిగా అదే బాట పట్టాల్సి వచ్చింది. కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చిన ఈ ధరల యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందా? ఈ ముచ్చట మరో ఆర్నెల్లే అంటున్నారు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విఠల్. ఇటీవల వొడాఫోన్-ఐడియా సెల్యులార్ విలీనానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో మార్కెట్ మూడు కంపెనీల మధ్య సమాన భాగాలుగా విడిపోయిందని విఠల్ చెప్పారు. దీనివల్ల రాబోయే ఐదారు నెలల్లో మొబైల్ సేవల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రధాన టెల్కోలకు పెట్టుబడి మీద రాబడి లేదని.. మరికొన్నాళ్లు ఇదే ధరల యుద్ధం కొనసాగిస్తే ఇప్పటికే భారీగా ఆదాయంలో కోత పెట్టుకుని కష్టం మీద నెట్టుకొస్తున్న కంపెనీలన్నీ నాశనం కాకతప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం టెలికాం మార్కెట్ లీడర్ గా ఉన్న ఎయిర్ టెల్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కేవలం రూ.97.3 కోట్ల లాభం నమోదు చేసింది. భారత్ లో ధరల యుద్ధం కారణంగా భారీ నష్టాలు ఎదుర్కొంది. అయితే జియో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కస్టమర్లకు మరికొంత కాలం పాటు కూడా తక్కువ టారిఫ్‌ ధరలకు సేవలు అందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి టారిఫ్‌ల తగ్గింపు కొనసాగిస్తామని తెలిపారు.