‘పెర్ఫార్మన్స్’ సరిగ్గ లేదనే నెపంతో నలుగురు’ రా ‘ సీనియర్ అధికారులపై వేటు.

న్యూఢిల్లీ:
దేశ అత్యున్నత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సంచలనం సృష్టించింది. ఏడాదిగా సరిగా పనిచేయలేదని చెబుతూ నలుగురు సీనియర్ అధికారులపై వేటేసింది. నలుగురు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులకు వారి సేవాకాలం కంటే ముందుగా బలవంతపు పదవీ విరమణ చేయించినట్టు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. సర్వీస్ రికార్డ్, వార్షిక పనితీరు అంచనాలు పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏడాదిగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని సీనియర్ స్థాయిల్లో ఉన్న అనుత్పాదక అధికారులను తొలగించడం జరుగుతోంది. 30 ఏళ్ల సేవాకాలం లేదా 50 ఏళ్ల వయసు దాటిన వారి వార్షిక పనితీరు పరిశీలించి డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ) తొలగింపులు జరుపుతోంది. అందులో భాగంగానే ఈ నలుగురి వేటు పడినట్టు తెలిసింది. ఈ నలుగురి వయసు 50 ఏళ్లు దాటేసిందని, చాలా కాలంగా ప్రమోషన్లు సాధించకుండా అక్కడే అంటిపెట్టుకొని ఉన్నారని ఈటీ తెలిపింది.సందేహాస్పద పనితీరు ఉన్న అధికారులపై శాఖాపరంగా తగిన క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు ఆధారాలు లేని పక్షంలో వారిని సేవలను తొలగించేందుకు బలవంతంగా పదవీ విరమణ చేయించవచ్చన్న సుప్రీంకోర్ట్ తీర్పు ఆధారంగా డీఓపీటీ 2015 నుంచి పలువురు అధికారులు, సిబ్బందిని ఇంటిదారి పట్టించింది. గతంలో రా రిటైర్ మెంట్ కి ముందే వదుల్చుకోబోయే సిబ్బందికి గోల్డెన్ హ్యాండ్ షేక్ ప్రకటించేది. కానీ ఈ విధంగా రాలో నలుగురు సీనియర్ అధికారులను తొలగించడం సంచలనం సృష్టించింది.