“పెళ్ళి విషయం” లో పిల్లల మరియు పెద్దల పాత్ర ఎలా ఉండాలి ? ఎవరేం పాటించాలి ??

ముందుగా పెళ్ళి విషయంలో, అందరం ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి, అది..
“కులంలోపలే జరిగే, అంతర్గత వివాహాల కంటే., కులాంతర, మతాంతర వివాహాల వల్లనే ‘మరింత మెరుగైన మానవ సమాజం’ ఆవిష్కరణ సాధ్యమౌతుంది అనేది వాస్తవం. ఇది సైన్స్ చెప్పిన సత్యం..”
పిల్లలు తమకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటామని అభిప్రాయపడితే కంగారు పడాల్సిన అవసరం లేదు.. ఆ విషయం వారి తల్లిదండ్రులకు నచ్చకపోతే.. వారితో ఆ తల్లిదండ్రులు, సావధానంగా చర్చించాలి.
బాగా ఆలోచించుకొమ్మని భవిష్యత్తులో ఆ జంట ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందేమో, అని మీ (తల్లిదండ్రుల) అనుభవాలను, పిల్లలకు చెప్పాలి. ఇంత చేసినా, (పిల్లలు) పెద్దవాళ్ళ మాట వినకుండా.. ఆ పిల్లలు “తాము అన్నీ ఆలోచించుకొనే, ఎదుటి వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి సరియైన నిర్ణయమే తీసుకున్నాము” అని అంటే.
ఇక అక్కడ ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు సహకరించడం తప్ప వారు చేయగలిగిందేమీ లేదు, ఉండదు. ఎందుకంటే.
పిల్లల పెళ్ళిల్ల గురించి, తల్లిదండ్రులకు చాలా విషయాల్లో అభ్యంతరాలు ఉండవచ్చు, అయితే వారి పిల్లలు, తమ పెళ్ళి నిర్ణయాన్ని మార్చు కోడానికి ఇష్టపడకుండా, ఖచ్చితంగా, తమకు నచ్చిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటామంటే.
ఇక ఆ తల్లిదండ్రులు వారి పిల్లల పెళ్ళికి చేతనైన సహాయం చేయాల్సిందే.. లేదా వారి మానాన వారిని బ్రతకమని వారిని (ఆ పిల్లలను) అలా వదిలేయాల్సిందే.. అంతే గాని దురహంకారంతో (లేదా తల్లిదండ్రుల దృష్టిలో పెంచిన ప్రేమతో, పిల్లలు తమ స్వంత ఆస్తిగా భావించి వారిపై) పిల్లలపై కక్షసాధింపు చర్యలకు దిగ కూడదు..

పిల్లల పెళ్ళి విషయంలో, పెద్దవాళ్ళుగా, మనమందరం గుర్తంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

1) “ఎదిగిన పిల్లలు తమ పార్ట్నర్ను తామే ఎంపిక చేసుకునే విధంగా తల్లిదండ్రులే వారిని, చిన్నప్పటి నుండే ట్యూన్ చేయాలి”.
2) “ఎదిగిన పిల్లలు కూడా తమకు అన్ని విధాలుగా నచ్చిన వ్యక్తినే, తమ జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలి. తాము ఎంపిక చేసుకున్న (అవతలి) వ్యక్తి, తమను ఇష్టపడే పరిస్థితి లేకపోతే, ఆ వ్యక్తిని స్వచ్ఛందంగా వదులు కోవాలి, అంతేగాని ఎదుటి వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ దౌర్జన్యానికి దిగరాదు.”
3) “పిల్లలు తమ పార్ట్నర్ ను ఎంపిక చేసుకునేటపుడు కుల, మత, ప్రాంత, సాంఘీక హోదా, రాజకీయ హోదా మరియూ ఆస్థిపాస్తులకు, ఇంకా పరువు, ప్రతిష్టలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి.అంటే కేవలం ఎదుటి వారి గుణానికీ మరియూ వ్యక్తిత్వానికి మాత్రమే ప్రాధాన్యత నిచ్చి, ఒకరి అభిప్రాయాలు, ఒకరికి నచ్చితేనే.. ఎదుటి వారిని, తమ జీవిత భాగస్వామిగా సెలెక్ట్ చేసుకోవాలి”.
— చెలిమెల రాజేశ్వర్.