పైపులైను లో పడి ఇద్దరు ఎల్ అండ్ టి కార్మికుల దుర్మరణం.

హైదరాబాద్:
ఈరోజు ఉదయం ఉప్పల్ స్టేడియం దగ్గర జరిగిన వాటర్ పైప్ లైన్ ఇన్స్పెక్షన్ ఛాంబర్ లో
పడి ఎల్ & టి సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటనలో జలమండలి డైరెక్టర్ టెక్నికల్ సత్య సూర్యనారాయణను విచారణ అధికారిగా నియమించినట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిషోర్ తెలిపారు. ఈ ఇద్దరు కార్మికులు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారు. చనిపోయిన కార్మికులకు చెరో 10 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లిస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ వాటర్ పైప్ లైన్ 1300 ఎం.ఎం. డయా తో 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు మరియు 2 మీటర్ల లోతు తో వాటర్ సప్లై కు సంబంధించిన ఇన్స్పెక్షన్ ఛాంబర్ ను ఎల్ & టి సంస్థ నిర్మిస్తున్నది. నిర్మాణంలో వున్న ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇద్దరు కార్మికుల మృతికి కారణమై, పనుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహిరించిన ఎల్ & టి సంస్థ, సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని దానకిషోర్ తెలిపారు.చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు దానకిషోర్ సంతాపాన్ని తెలియచేసారు.