తిరువనంతపురం;
తన కూతురి నిర్వాకంతో ఒక ఐ.పి.ఎస్.ఉన్నతాధికారి బదిలీ అయ్యారు. కేరళ అదనపు డిజిపి సుదేష్ కుమార్ డ్రైవర్ గవాస్కర్ పై ఆయన కూతురు మూడు రోజుల క్రితం దాడి చేశారు. ఆ ఘటనపై గవాస్కర్ భార్య ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో అదనపు డిజిపిని బదిలీ చేశారు. సుదేష్ కుమార్ భార్యాబిడ్డలు వాకింగ్‌కు వెల్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు డ్రైవర్ గవాస్కర్ ఆలస్యంగా వచ్చారు. ఐపీఎస్ కూతురు అతన్ని బూతులు తిట్టారు. ఆలస్యానికి గల కారణాన్ని చెప్తున్నా వినకుండా ఆమె నానా రభస చేశారు. అనవసరంగా నోరుపారేసుకోవద్దని గవాస్కర్ ఆమెను కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి అతని పై దాడికి దిగారు. మొబైల్ ఫోన్‌తో అతడి మెడపై బాది గాయం చేశారు. ఈ విషయమై డ్రైవర్ గవాస్కర్ భార్య కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుదేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గవాస్కర్ వైద్యం కోసం కేరళ డీజీపీ 50 వేల రూపాయలు అందించారు. సుదేశ్ కుమార్ కూతురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. గవాస్కర్ ఘటన తర్వాత కేరళలోని పోలీసు ఉన్నతాధికారుల నివాసాల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వాళ్ల ఇద్ద చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.