పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకొంటే పాసులు ఫ్రీ!!

టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో విసురుతున్న సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఓ పక్క జియో దూకుడుగా దూసుకెళ్తూ ప్రతి నెలా లక్షలాదిగా కొత్త కస్టమర్లను చేర్చుకుంటోంది. దీంతో ఉన్న వినియోగదారులను నిలుపుకొని కొత్తవారిని చేర్చుకొనేందుకు వొడాఫోన్ ఐడియా ఈ పండుగ సీజన్ లో ప్రత్యేక డేటా ప్యాకేజీలు, కూపన్లతో సహా అనేక ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది.గుజరాత్ లో వొడాఫోన్ రూ.399 అంత కంటే ఎక్కువ రెంటన్ ఉన్న కొత్త పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నవారికి గర్బాలో పాల్గొనేందుకు ఉచిత కపుల్ పాసులు ఇస్తోంది. ఇప్పటికే కోల్ కతాలో అగోమోనీ కార్యక్రమానికి ఇలాంటి పాసులు ఇచ్చింది. ఈ కొత్త పాసుల ఆఫర్లు రెండు నెలల వయసున్న వొడాఫోన్ ఐడియా పుంజుకొనేందుకు దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల ద్వారా కీలక యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) అధికంగా ఉంటుందనే వొడాఫోన్ ఐడియా ఈ ఆఫర్లను ప్రకటించిందని టెలికామ్ రంగ నిపుణులు చెబుతున్నారు.