ప్రగతి నివేదికలను వెంటనే రూపొందించాలి. – చీఫ్ సెక్రటరీ జోషీ ఆదేశం.

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రానిికి సంబంధించి 15 వ ఆర్ధిక సంఘానికి సమర్పించవలసిన మెమోరండానికి అవసరమైన సమాచారాన్ని వారం రోజులలోగా ఆర్ధిక శాఖకు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో 15 వ ఆర్ధిక సంఘానికి సమర్పించవలసిన మెమోరండంపై వివిధ శాఖల అధికారులతో సి.యస్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ సలహాదారు జి.ఆర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, కె.రామకృష్టారావు,జయేష్ రంజన్, సునీల్ శర్మ, పార్ధసారధి, శివశంకర్, కార్యదర్శులు బి.వెంకటేశం, నవీన్ మిత్తల్, బుద్ధప్రకాశ్ జ్యోతి, సభ్యసాచి ఘోష్, బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, అధికారులు నీతు ప్రసాద్, టి.కె.శ్రీదేవి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ 2020-25 సంవత్సరాలకు సంబంధించి యన్.కె.సింగ్ నేతృత్వంలోని 15 వ ఆర్ధిక సంఘానికి సమర్పించే నిమిత్తం వివిధ శాఖలు ఖచ్చితమైన సమాచారాన్ని ఆర్ధిక శాఖకు సమర్పించాలన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఎడ్యుకేషన్, వ్యవసాయం స్టేట్ ట్యాక్స్, విద్యుత్, ఆర్ డబ్యుఎస్, హెల్త్, తదితర ముఖ్యమైన శాఖలకు సంబంధించి Performance Indicators ఫ్లాగ్ షిప్స్ ప్రొగ్రామ్స్, నిధుల వ్యయం, కేటాయింపు లక్ష్యాలు, అవసరమైన నిధులు, ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి, గతంలో కేటాయించిన నిధులు, తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రోడ్ల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ,తెలంగాణకు హరితహారం, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు,కొత్త జిల్లాల ఏర్పాటు, జి.యస్.టి టాక్స్ నెట్ పరిధి పెంపు, జనాభా నియంత్రణ, పాలనలో సంస్కరణలు తదితర అంశాలపై ప్రత్యేకంగా పేర్కొని Performance బేస్ట్ గ్రాంట్లు పొందే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి శాఖ ముఖ్యమైన Performance Indicators ను రూపొందించుకోవాలన్నారు.
పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు, స్ధానిక సంస్ధల గ్రాంట్ల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంక్షేమ శాఖలన్నీ తమ నివేధికలు ఒకే తరహాలో ఉండాలన్నారు. టూరిజం సర్కుట్స్, హెరిటేజ్ రక్షణ, ఎకనామీ మెజర్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, నూతన పద్ధతుల అమలు, సబ్సిడీలు, వాటి ప్రభావం రైతుల రుణ మాఫి, రైతు భీమా, రైతు బంధు, విద్యుత్ సరఫరా నష్టాలు, వివిధ రంగాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు, పరిశ్రమల రంగంలో ప్రగతి తదితర అంశాలన్ని నివేధికలో పొందుపరచాలన్నారు.