ప్రజల్ని కలవని’జనాకర్షక’ కేసీఆర్ !!

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదా? లేదా? సంక్షేమ పథకాలతో గడచిన నాలుగున్నరేళ్లుగా’స్వైరవిహారం’ చేస్తున్న కేసీఆర్ తనపై తానే నమ్మకం కోల్పోయారా ? ఆయనపై ప్రజల్లో సానుకూలత తుపాను ఎందుకు లేనట్టు ? లోపం ఎక్కడున్నది? పాపం ఎవరిది ?ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఎందుకు వ్యక్తమవుతున్నది? ప్రజల్లో ఎక్కడో… ఏదో అసంతృప్తి… నిరాశ, నిరుత్సాహం. మొదటి టర్మ్ లో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ‘ఫలితాల’ ను ఇవ్వవని కేసీఆర్ నిర్ధారించుకున్నట్టు ఆయన ‘పాక్షిక’ మేనిఫెస్టో వెల్లడిస్తున్నది. ఇప్పటికే ఉన్న ‘జ‌నాక‌ర్ష‌కప‌థ‌కాల’కుతోడుగా మరికొన్ని కార్యక్రమాలు ఈ ‘పాక్షిక’ మేనిఫెస్టోలో చోటు చేసుకున్నవి. ఇవన్నీ ఎర్రవల్లి ఫామ్ హౌజ్లోనో, ప్రగతి భవన్ లోనో రూపకల్పన జరిగినవే. అమల్లో విఫలమైన ఎస్.సి, ఎస్.టిలకుమూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి పథకాలతో పాటు ఇంకా పలు అంశాలు అధికారపార్టీని ‘ఆత్మరక్షణ’ లో పడవేసినట్టు ‘పాక్షిక’ మేనిఫెస్టో రుజువు చేస్తున్నది.

ప్రజల్ని కలవని’జనాకర్షక’ కేసీఆర్ !!

ఎస్.కే.జకీర్.

టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కు ఏమైంది ? ఆయనలో సృజనశీలత ఏమైంది ? ఎందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘కాపీ పేస్టు’ చేశారు. కేసీఆర్ గొప్ప సృజనశీలుడు. ప్రత్యర్థులను ఊపిరి సలపనివ్వని వ్యూహాలు, ఎత్తుగడలతో ఉక్కిరిబిక్కిరి చేసే మనిషిలో ‘బేలతనం’ ఏమిటి ? ప్రతి కుటుంబంలో కనీసం ముగ్గురు సభ్యులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులని కేసీఆర్ భావిస్తూ వచ్చారు. నికరంగా అలాంటి వారు ఒక కోటి 75 వేల మందికి పైగా లబ్దిదారులున్నట్టు కూడా అంచనా వేసుకున్నారు. ఆ లబ్దిదారులంతా ఓటర్లుగా పరిణామం చెందారని, పోలింగు బూతుల్లో టిఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు లేకపోయినా ఈవిఎంలలో’కారు’ గుర్తును ప్రజలు వెతికి, వెతికి, వెంటాడి పట్టుకొని ఓటు వేసి వెళతారన్నది కేసీఆర్ నమ్మకం. ఆ నమ్మకం కొంత సడలిందా ? లేకపోతే ఏమి జరిగింది ? కేసీఆర్ ఎన్నడూ ఇతరుల ‘ట్రెండ్’ఫాలో కారు. తానే ఒక ‘ట్రెండ్’ ను సృష్టిస్తారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ‘అప్రకటిత మేనిఫెస్టో ‘ ను ఎందుకు అనుసరించవలసి వచ్చినదన్న అంశం కేసీఆర్ ‘వీరాభిమానుల’ను కలవరపరుస్తున్నది. ” విశ్వసనీయత ఉన్న వాళ్ళు చెప్పే మాటలకు, విశ్వసనీయత లేని వాళ్ళు చెప్పే మాటలకు మధ్య పోరాటం” గా కేసీఆర్ తమ ‘పాక్షిక ఎన్నికల ప్రణాళిక’ ను ప్రకటించగానే ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్య. ఆ వ్యాఖ్యలో వ్యంగ్యమూ ఉన్నది. వాస్తవమూ ఉన్నది.

క్రెడిబులిటీఉన్నవారెవరో, లేనివారెవరో ప్రజలు అర్ధం చేసుకోవలసి ఉన్నది. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు విలువలేదని, అవి అమలు సాధ్యం కాదని, ఆపద మొక్కులుఅని గత ఆగస్టులోనే కేసీఆర్ కొట్టి పారేశారు. అదే కేసీఆర్ కాంగ్రెస్ ‘మేనిఫెస్టో’ అంశాలను ‘లిఫ్ట్’ చేయడంపై చర్చ జరగకుండా ఎలా ఉంటుంది ? కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదనే అనుకుందాం. మరి అలాంటి విశ్వసనీయత లేని పార్టీ ‘హామీల’ను టిఆర్ఎస్ ఎందుకు ప్రకటించవలసి వచ్చింది ? దీని వల్ల ఎవర్ని ‘విశ్వసనీయ’ వ్యక్తులుగా ప్రజలు నమ్ముతారు ? ” WHO IS నిరుద్యోగి ” అంటూ కేసీఆర్ కాంగ్రెస్ ‘నిరుద్యోగులభృతి’ హామీని తన సహజ శైలిలో హేళన చేశారు. ఒక టివి న్యూస్ ఛానల్ అప్పటి, ఇప్పటి కామెంట్స్ ను పోల్చుతూ వీడియో క్లిప్పులను మంగళవారం రాత్రి నుంచి ప్రసారం చేస్తున్నది. కేసీఆర్, టిఆర్ ఎస్ వ్యతిరేక ఛానల్ గా ముద్ర పడినందున ఆ న్యూస్ ఛానల్ కు ‘విశ్వాస నీయత’ లేదని అనుకోవాలా ? లేదా ఆయా కథనాలకు విశ్వసనీయత లేదనుకోవాలా ? తెలంగాణ కాంగ్రెస్ ఇంకా తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేయలేదు. మాజీ ఉపముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనరసింహ చైర్మన్ గా ఉన్న మేనిఫెస్టో కమిటీ ఆ పనిలో ఉన్నది. ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నది. ఇప్పటివరకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తదితర పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార సభలలో లేదా విలేకరుల సమావేశాల్లో చేసిన ప్రకటనలే ‘ఎన్నికల హామీలు’ గా ప్రజల్లోకి దూసుకుపోయాయి. రైతులకు 2 లక్షల రుణ మాఫీ, నిరుద్యోగులకు భృతి తదితర అంశాలు ప్రజల్ని బలంగా తాకాయి. ప్రజల్లో వాటిపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ , టిఆర్ఎస్ ల మంచి చెడులను బేరీజు వేస్తున్నారు. ఈ రెండు పార్టీల ‘విశ్వసనీయత’పై కూడా లోతుగానే చర్చ జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన ప్రజల్లోనూ సామాజిక స్పృహ ఉన్నది. ఏవి నీళ్లు ! ఏవి పాలు ! అన్నది వాళ్లకు తెలుసు. వాళ్ళు తమ దైనందిన జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఉన్నవి. తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ప్రజల చైతన్య స్థాయి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువ. ‘మాటల గారడీ’ కి ఓట్లు రాలతాయనుకుంటే అది భ్రమ. ఆ కాలం పోయింది. కాంగ్రెస్ అయినా, టిఆర్ఎస్ అయినా, మరొక పార్టీ అయినా ఆయా పార్టీల ఎన్నికల ‘గుర్తు’ ఒక్కటే ప్రామాణికం కాదు. స్థానిక ప్రజాప్రతినిధులుగా నిరంతరం ప్రజల్లో ఉండవలసిన సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పిటిసిల పని తీరు, చోటా మోటా నాయకులు మొదలుకొని ఎమ్మెల్యే వరకు వారి పనితీరు, ప్రజల సమస్యల పట్ల స్పందన, పరిష్కరించే తీరు…. వీటన్నింటికన్నా ముఖ్యమైనది, ప్రజలతో సంబంధాలు. ఇంగ్లీష్ లో దాన్నే ‘కనెక్టివిటీ’ అంటున్నాం. ప్రజలతో పూర్తిగా ‘డిస్ కనెక్టు’ అయిన ప్రజాప్రతినిధులూ ఉన్నారు. నిత్యసంబంధాలు కలిగిన వారూ ఉన్నారు. ప్రత్యర్థుల కారణంగానో, కొన్ని పరిస్థితుల వల్లనో, దళితుడైనందుకో అనేక వివాదాలు ముసురుకున్నా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం వేములకు రక్షణ కవచంగా ఉన్నది ‘ప్రజలతో కనెక్టివిటీ’ మాత్రమే. ఆ కనెక్టివిటీని ఆయన దుర్బేధ్యంగా మలచుకున్నారు. ఇక ప్రజలతో సంబంధాలను నిర్లక్ష్యం చేసిన వారు, ప్రజల బాగోగులను పట్టించుకునే తీరిక లేనివారు, ప్రగతిభవన్, ఫామ్ హౌజ్ చుట్టూ తిరుగుతున్న వారిని ప్రజలు ‘తిరస్కరిస్తున్నారు’. కొన్ని చోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులను తిప్పి పంపుతున్నారు. వెళ్లగొడుతున్నారు. ‘తరిమిగొడుతున్నార’ ని అనడం పార్లమెంటరీ భాష కాదు. ఇవన్నీ ఒక ఎత్తు. కేసీఆర్ ‘ఫ్యాక్టర్ ‘ ఒక ఎత్తు. ”కేసీఆర్ పేరు చెబితే ఓట్లు పడతాయి”, ”కేసీఆర్ ఒకసారి ప్రచారం చేస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి”, కేసీఆర్ ఎదో ఒకటి చేస్తారు. ఆయన దగ్గర అనూహ్యమైన మంత్రం దండం ఉన్నది. మళ్ళీ టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు వస్తారు”, ” కెసీఆర్ కు తిరుగు లేదు. కాంగ్రెస్ లో ఆయన సమ ఉజ్జీ ఎవరూ లేరు” అని చాలామంది టిఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాట. ” మా నినాదం కేసీఆర్” అని మంత్రి, టిఆర్ఎస్ అంతర్గత సంక్షోభ పరిష్కర్తకేటీఆర్ పదే, పదే అంటున్నారు. అయితే ‘ప్రజల్ని కలవని ఏకైక ముఖ్యమంత్రిగా అపఖ్యాతిని మూట గట్టుకున్న కేసీఆర్’ లో ఈ సారి ‘ గుణాత్మక మార్పు’ నమ్మవచ్చునా? గతంలో చాలా ముఖ్యమంత్రులను తెలంగాణ ప్రజలు చూశారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కావచ్చు. ప్రజల్ని కలవడం, ప్రజలకోసం సమయం కేటాయించడం, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం… వంటి సన్నివేశాలను ప్రజలు చూశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా అటువంటి ‘వైఖరి’ ని ఆశించడంలో తప్పు ఏమిటి ? ” మా పథకాలే మాకు ఓటు బ్యాంకులు ” అని గంభీరంగా చెప్పుకున్న టిఆర్ఎస్ నాయకులు, కొత్త పథకాలకు ఎందుకు పదును బెట్టినట్టు?పైగా కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలనే ప్రస్తావించడంలో ఆంతర్యం ఏమిటి ? అంటే, కేసీఆర్ ‘డిఫెన్సు’ లో పడినట్టు భావించాలా ? కాంగ్రెస్ చెబితే ‘అమలు కావు’ అని తేల్చి పారేసిన వాటినే తాను చెబితేనేఅమలవుతాయని ప్రజలు నమ్ముతారని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారా ? ఇవన్నీ టిఆర్ఎస్ లో నెలకొన్న అయోమయ పరిస్థితులకు అద్దం పడుతున్నవి.