ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రం హరికృష్ణ స్మారక భూమి.

కిశోర్, హైదరాబాద్;

తెలుగుదేశం పార్టీ దివంగత నాయకుడు హరికృష్ణ స్మారక స్థూపం కోసం జూబిలీహిల్స్ ‘మహా ప్రస్థానం’ లో 400 గజాల స్థల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అస్త్రంగా కూడా మారనున్నది. హరికృష్ణ తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. 2009 లో ‘మహాకూటమి’ లో టిఆర్ఎస్ ను చేర్చుకోవడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కు లేఖ రాసి అప్పట్లో కలకలం రేపారు. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోను హరికృష్ణ మొండిగా వ్యవహరించినట్టు టిఆర్ఎస్ కార్యకర్తలు చెబుతుంటారు.ఆయన మరణానంతరం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రముఖులు చేసిన హడావుడి, మహా ప్రస్తానం స్మశాన వాటికలో ఏకంగా 400 గజాల భూమిని హరికృష్ణ స్మారక స్థూపానికి ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. నందమూరి హరికృష్ణ స్మారక స్థూపం కోసం తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడాన్ని టీఆర్‌ఎస్ మాజీ నేత కొండా సురేఖ తప్పుబట్టారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న కొండా సురేఖ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. సినీ నటుడు హరికృష్ణ స్మారకానికి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో చెప్పాలని కొండా సురేఖ ప్రశ్నించారు.

హరికృష్ణ ఉద్యమకారుడా లేక కేసీఆర్‌కు చుట్టమా లేదా తెలంగాణ పోరాట యోధుడా, అమరవీరుల కుటుంబ సభ్యుడా అని ఆమె ప్రశ్నించారు.అతను చనిపోయిన కొద్ది నిమిషాల్లోనే తండ్రీకొడుకులు ఇద్దరూ వెళ్లారని, అంత్యక్రియలు పూర్తయ్యే దాకా కేటీఆర్ అక్కడే ఉన్నారని, 450 గజాల స్థలాన్ని స్మారక స్థూపం కోసం కేటాయించారని, ఎవడబ్బ సొమ్మని హరికృష్ణకు తెలంగాణ భూమిని ధారాదత్తం చేశారని కొండా సురేఖ దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మీకు టైం దొరకలేదని, మాజీ సీఎం టి.అంజయ్య భార్య మణెమ్మ చనిపోతే మీకు తీరిక దొరకలేదని, కొండగట్టులో 60మంది చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేసీఆర్‌కు తీరిక దొరకలేదని ఆమె విమర్శించారు.కేసీఆర్ కుటుంబంపై కొండా సురేఖ పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు. మందుగోలీలు ఇచ్చే సంతోష్‌ను రాజ్యసభకు పంపారని, లష్కర్‌ బోనాలకు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవితకు అర్హత ఏంటి? అంటూ విమర్శించారు. అలాగే కుమారుడికి పట్టం కట్టేందుకు కేసీఆర్‌ ఆరాటపడుతున్నారని సురేఖ అన్నారు. కేసీఆర్‌ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, ప్రతి పనికి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బార్లకు అనుమతి ఇచ్చారని, ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేని అసమర్ధ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, ఉద్యమంలో కోదండరాంను పొగిడినవాళ్లు ఇప్పుడు దూషిస్తున్నారని, ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మశాంతించాలంటే టీఆర్‌ఎస్‌ను ఓడించాలని సురేఖ అన్నారు. తమ కూతురు సుస్మితా పటేల్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సురేఖ చెప్పారు. ఉద్యమకారులకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని ఆమె విమర్శించారు.