ప్రత్యామ్నాయమా!కేసీఆర్ కు ‘ఉపకారమా’!’అనుమానాస్పద’ ఫ్రంట్!!

కాంగ్రెస్ కూటమి ఏకైక ఎజండా కేసీఆర్ ను గద్దె దింపడం. ఆ కూటమికి స్పష్టత ఉన్నది. మరి సిపిఎం ఎజండా ఏమిటి? బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లక్ష్యాలు ఏమిటి? కాంగ్రెస్ కూటమికి వెలుపల ఉండి పోరాడితే ప్రయోజనం ఎవరికి? ఎవరు లబ్ది పొందుతారు? సిపిఎం కు ఉన్న సొంత బలం ఏమిటి? ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలవగలదు? ఎన్ని నియోజకవర్గాలలో జయాపజయాలను నిర్ణయించగలదు? ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని సెగ్మెంట్లలో మినహా సిపిఎం ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో ఎక్కడున్నవి? జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీలతో జట్టు కట్టాలని, ఆ పార్టీలను బి ఎల్ ఎఫ్ లో కలపాలని జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఉద్దేశాలు ఏమిటి? తెలంగాణ లో కాంగ్రెస్ కూటమి, టిఆర్ఎస్ ల మధ్య ‘ముఖాముఖి’ పోరును ‘త్రిముఖ’ పోరుగా మలిచే ప్రయత్నమేమైనాజరుగుతున్నదా? అలా జరిగితే నష్టం ఎవరికీ? లాభం ఎవరికి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని సాధారణంగా ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తుంటాయి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట రంగంలో దిగే అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చవచ్చు? దాని వల్ల కేసీఆర్ నెత్తిన పాలుపోసినట్లు కాదా? ‘టిఆర్ఎస్ వ్యతిరేక మహాకూటమి అర్ధం పర్ధం లేనిది, ప్రజలకు ఉపయోగపడనిది’ అన్నది కామ్రేడ్ తమ్మినేని నిర్వచనం.తమ్మినేని వీరభద్రం లేదా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నాయకులెవరైనా చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ రంగాన్ని గందరగోళపరుస్తున్నవి.ఏళ్ల తరబడి ‘తోకపార్టీల’ వలే పనిచేసినందున వామపక్ష ఉద్యమాలు బలహీనపడడం, చట్టసభల్లో కామ్రేడ్ల సంఖ్య అనూహ్యంగా పతనం కావడం నిజమే. అయితే ఇప్పుడు ‘నాలుగున్నర సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక పద్ధతులు, కుటుంబపాలన’ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టకపోవడంపై సహజంగానే అనుమానాలు కలుగుతున్నవి.

ఎస్.కె.జకీర్.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కదలికలపై రాజకీయవర్గాలలో అనుమానాలు కలుగుతున్నవి. 25 రాజకీయ సంస్థలతో ఏర్పడిన ఈ ‘ ఫ్రంట్ ‘ రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు’ప్రత్యామ్నాయ’ శక్తిగా చెప్పుకుంటున్నది. అయితే ఈ రెండు పార్టీలలో ‘ప్రథమశత్రువు’ ఎవరన్నది ఫ్రంట్ తేల్చుకోలేకపోతున్నది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నవి. రెండు పార్టీలకు ‘ప్రత్యామ్నాయంగా’ అవతరించే శక్తి సామర్థ్యాలు, అన్ని హంగులు ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ కు ఉన్నాయా? అన్నది మరో ప్రశ్న. కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి గాను బిఎల్ఎఫ్దగ్గరున్న’రోడ్ మ్యాప్’ ఏమిటి? ఎంత కాలంలోగా’ప్రత్యమ్నాయశక్తి’ గా ఫ్రంట్ రూపు దాల్చగలదు? సైద్ధాంతికంగా ఉన్న పునాదులు, క్షేత్ర స్థాయిలో ఉన్న బలగాల మాటేమిటి! అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు పోటీ చేయనున్నట్టు బిఎల్ఎఫ్ కన్వీనర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గతంలో ప్రకటించారు. ఆ దిశగా ఆయన, ఆయనతో పాటు మరికొందరు బిఎల్ ఎఫ్ నాయకులు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ నెలాఖరులోగా సిపిఎం తో పాటు ‘ ఫ్రంట్’ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తమ్మినేని కామారెడ్డిలో ప్రకటించారు. ”బిసిని ముఖ్యమంత్రి” చేయాలనుకుంటున్నందున 60 అసెంబ్లీ స్థానాలు బిసిలకు కేటాయిస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్, టిడిపి కృష్ణయ్య లనుబహుజన లెఫ్ట్ ఫ్రంట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నవి. కనీస వ్యవస్థాగత నిర్మాణం కూడా లేకపోయినప్పటికీ తమతో పొత్తులు పెట్టుకోడానికి సీపీఎం వెంపర్లాడుతుండడం చూసి పవన్ కల్యాణ్‌ ముచ్చట పడ్డారు .

సిపిఎంతో జట్టుకట్టి తెలంగాణ ఎన్నికల బరిలో ‘జనసేన’ దిగనున్నది. తమ్మినేని వీరభద్రం జనసేన నాయకులతో ఇదివరకే చర్చలు జరిపారు. పవన్ వస్తే ‘ఫ్రంట్’ కు బలం వస్తున్నది తమ్మినేని వాదన. తెలంగాణ రాజకీయ రంగస్థలం కాంగ్రెస్ కూటమి, టిఆర్ఎస్ ల మధ్య పోటీగా కేంద్రీకృతం అవుతున్నది. బిజెపి స్వతహాగా పది పన్నెండు సీట్లలో పోటీ ఇచ్చినా, గెలుపు మాత్రం నాలుగైదు స్థానాలకే పరిమితం కావచ్చును. ఇక తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ ఎస్ తో ‘కాంగ్రెస్ కూటమి’ మాత్రమే బలంగా ఢీకొనగలదన్నది నగ్న సత్యం. పరిస్థితులు ఈ రకంగా కనిపిస్తున్న వేళ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనుసరిస్తున్న ధోరణి, రాజకీయ పంథా, ఎత్తుగడలు పలు అనుమానాలను, ప్రశ్నలను లేవనెత్తుతున్నవి. అంతిమంగా ఈ ఫ్రంట్ కార్యకలాపాలన్నీ కేసీఆర్ కు ‘పరోక్షంగా’ దోహదపడతాయని రాజకీయ పరిశీకుల అంచనా. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని మహాజన పాదయాత్ర జరిపినప్పుడు రాష్ట్రంలో ‘కామ్రేడ్ల’ మధ్య ఐక్యతను బలంగా ఆకాంక్షించారు. ఆ తర్వాత ఏమిజరిగిందో తెలియదు. సిపిఐ కాంగ్రెస్ కూటమి వైపు మరలింది. కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుపెట్టుకోవడం ప్రయోజనకరమని సిపిఐ భావిస్తున్నది. కానీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నిర్మాత అయిన సిపిఎం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్, టిఆర్ఎస్… రెండింటినీ ఒకే గాటనకడుతున్నది. కాంగ్రెస్ కూటమి ఏకైక ఎజండా కేసీఆర్ ను గద్దె దింపడం. ఆ కూటమికి స్పష్టత ఉన్నది. మరి సిపిఎం ఎజండా ఏమిటి? బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లక్ష్యాలు ఏమిటి? కాంగ్రెస్ కూటమికి వెలుపల ఉండి పోరాడితే ప్రయోజనం ఎవరికి? ఎవరు లబ్ది పొందుతారు? సిపిఎం కు ఉన్న సొంత బలం ఏమిటి? ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలవగలదు? ఎన్ని నియోజకవర్గాలలో జయాపజయాలను నిర్ణయించగలదు? ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని సెగ్మెంట్లలో మినహా సిపిఎం ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో ఎక్కడున్నవి? జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీలతో జట్టు కట్టాలని, ఆ పార్టీలను బి ఎల్ ఎఫ్ లో కలపాలని జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఉద్దేశాలు ఏమిటి? తెలంగాణ లో కాంగ్రెస్ కూటమి, టిఆర్ఎస్ ల మధ్య ‘ముఖాముఖి’ పోరును ‘త్రిముఖ’ పోరుగా మలిచే ప్రయత్నమేమైనాజరుగుతున్నదా? అలా జరిగితే నష్టం ఎవరికీ? లాభం ఎవరికి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని సాధారణంగా ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తుంటాయి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట రంగంలో దిగే అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చవచ్చు? దాని వల్ల కేసీఆర్ నెత్తిన పాలుపోసినట్లు కాదా?బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర అణగారిన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో 25 పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ గా ఏర్పడినవి. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త’ ఐక్య వేదిక’ పురుడుపోసుకుందని సిపిఎం ప్రచారం చేసింది. ”ప్రజా పోరాటాల ఫలితంగా భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ ప్రజలు ఆశించిన రీతిలో పాలన సాగడం లేదని బహుజన ఫ్రంట్‌ భావిస్తున్నది . తెలంగాణ సామాజిక రాజకీయరంగంలో ఇప్పుడొక గాలి వీస్తోంది. 25 పార్టీలతో ‘బహుజన లెఫ్ట్‌ ఫ్రంటు’ (బిఎల్‌ఎఫ్‌) ఆవి ర్భవించింది. ఫూలే, అంబేద్కర్‌, మార్క్స్‌ సిద్ధాంతాల ఆలోచనల మేళవింపు, అన్ని రకాల దోపిడీ ఆసమానతలపై యుద్ధం, రాష్ట్రంలో రాజకీయాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఫ్రంట్‌ అడుగులు వేస్తున్నది. మతోన్మాద బిజెపి, అవినీతి కాంగ్రెస్‌, నియంతృత్వ టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కలిసి వచ్చేవారంతా ఒక్క చోటికి చేరుతున్నారు. వామపక్ష, బహుజన నాయకులు, అనేక ఉద్యమాలలో రాటుతేలినవారుబిఎల్‌ఎఫ్‌కు పెద్ద ఆస్తి. గద్దర్‌, కాకి మాధవరావు, నల్లా సుర్యాప్రకాశ్‌, తిరుమలి, జె.బి.రాజు, కంచ ఐలయ్య, పిఎల్‌ విశ్వేశ్వరావు తదితరులు ఇందులో ఉన్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే ఫ్రంట్ లక్ష్యం” అని తమ్మినేని వీరభద్రం గంభీరంగా ప్రకటించారు. ”గతంలో దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రజల బతుకులు మార్చడానికి ఏమాత్రం కృషిచేయలేదు. ఆ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు” అని ఆయన తేల్చి చెప్పారు. సిపిఎం అఖిలభారత మహాసభలకు ‘సహకారం’ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను బి.వి.రాఘవులు, తమ్మినేని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ”ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది ” అని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.

 

మహాసభలు విజయవంతంగా ముగిసినవి.ఇప్పుడు ముందస్తు ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల ‘ముసుగు’ తొలగిపోక తప్పదు. టిఆర్ఎస్ ను ఓడించడమే ఫ్రంట్ లక్ష్యమని ప్రకటించిన తమ్మినేని వీరభద్రం ఆ ‘దిశగా’ నే సిపిఎం ను, బి ఎల్ ఎఫ్ ను నడుపుతున్నారా? అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల్లో ఉన్నవి. ‘కాంగ్రెస్ కూటమి’ తో జట్టు కట్టకపోవడం పట్ల కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే చర్యలకు పాల్పడడం అధికారపక్షానికి సహకరించడమేనన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ”ఎవరి ఓట్లు చీల్చుతామో ఇప్పుడే చెప్పలేము. టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా చీల్చగలం. ఎవరినో గెలిపించడం, లేదా ఓడించడం అన్నది మా బాధ్యత కాదు.ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం” అని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అని అంటున్నారు. ” బిసి నే తెలంగాణ ముఖ్యమంత్రి” అని కూడా ఆయన ప్రకటించారు. ఎవరినోగెలిపించడానికె ఇంతకాలం తాము కష్టపడినందున వామపక్షాలు భారీగా నష్టపోయాయని అందువల్ల బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను నిర్మించినట్టు తమ్మినేని సిద్ధాంతీకరించారు. ‘టిఆర్ఎస్ వ్యతిరేక మహాకూటమి అర్ధం పర్ధం లేనిది, ప్రజలకు ఉపయోగపడనిది’ అన్నది కామ్రేడ్ తమ్మినేని నిర్వచనం.తమ్మినేని వీరభద్రం లేదా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నాయకులెవరైనా చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ రంగాన్ని గందరగోళపరుస్తున్నవి.ఏళ్ల తరబడి ‘తోకపార్టీల’ వలే పనిచేసినందున వామపక్ష ఉద్యమాలు బలహీనపడడం, చట్టసభల్లో కామ్రేడ్ల సంఖ్య అనూహ్యంగా పతనం కావడం నిజమే. అయితే ఇప్పుడు ‘నాలుగున్నర సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక పద్ధతులు, కుటుంబపాలన’ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టకపోవడంపై సహజంగానే అనుమానాలు కలుగుతున్నవి. కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడం తమ’ప్రాధాన్యం’ కాదన్నది బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మాటల్లో కనిపిస్తున్నది.