ప్రత్యేకహోదా ఫైలుపైనే రాహుల్ తొలి సంతకం. -పనబాక.

విజయవాడ;
పేదవాడు ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏపీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రరత్న భవన్ లో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ, రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏఫీకిప్రత్యేకహోదా ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని రాహుల్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చెప్పారు. కాగా, తొలుత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి 5కె రన్ ను ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి జెండా ఊపి ప్రారంభించారు.