ప్రధాని హత్యకు మావోయిస్టుల కుట్ర.

ముంబయి:
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని పుణె పోలీసులు వెల్లడించారు. సెషన్‌ కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు అనుమానిత మావోయిస్టు నుంచి స్వాధీనం చేసుకున్న లేఖను పోలీసులు బహిర్గతం చేశారు. జనవరిలో జరిగిన భీమా-కోరేగావ్‌ ఘర్షణల కేసులో చేపట్టిన దర్యాప్తులో ఈ లేఖ బయటపడ్డట్లు తెలిపారు. పుణె సమీపంలోని భీమా-కొరెగావ్‌ ప్రాంతంలో జనవరిలో దళితులు చేపట్టిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.దిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌ ఇంట్లో సదరు లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిషేధిత సీపీఐ మావోయిస్ట్‌ దళిత్‌కు చెందిన అయిదుగురు కార్యకర్తలను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా పలు విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. లేఖలో ఎం-4 రైఫిల్స్‌ కోసం రూ.8కోట్లు కావాలని, ‘రాజీవ్‌ గాంధీ తరహాలో మరో ఘటన’ అని ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల పవార్‌ కోర్టుకు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మరో ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేసి ఉండొచ్చని ఉజ్వల పవార్‌ పేర్కొన్నారు.ఈ లేఖను ఏఎన్‌ఐ విడుదల చేసింది. ‘బిహార్‌, పశ్చిమ్‌బంగలో ఓటమి పాలైనప్పటికీ.. మోదీ నేతృత్వంలోని బిజెపి 15కుపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇది ఇలాగే కొనసాగితే మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మోదీ రాజ్‌ను అంతమొదించేందుకు కొందరు సీనియర్‌ కామ్రేడ్లు కఠినమైన చర్యలను ప్రతిపాదించారు. రాజీవ్‌ గాంధీ హత్య తరహాలో పథకానికి ఆలోచిస్తున్నాం. బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఇటువంటి చర్యలకు పూనుకోవచ్చు. ఒకవేళ ఈ పథకం విఫలమైనా.. పార్టీని బతికించుకోవడమే ఏకైక లక్ష్యంగా నిర్ణయం తీసుకోవాలి’ అని లేఖలో ఉంది.