ప్రమాదంలో భారత క్రికెట్ : గంగూలీ

భారత క్రికెట్ లో లైంగిక వేధింపులపై టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై వ్యాఖ్యానిస్తూ భారత క్రికెట్ ప్రమాదంలో పడిందన్నాడు గంగూలీ. బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరి, ట్రెజరర్ అనిరుధ్ చౌదరీలకు రాసిన మెయిల్ లో పరిపాలక మండలి (సీఓఏ) వైఖరి ఆందోళన కలిగిస్తోందన్నాడు. జోహ్రీ కేసులో కార్యాచరణపై సీఓఏ సభ్యులు మాజీ సీఏజీ వినోద్ రాయ్, మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నాడు.అక్టోబర్ 25న సీఓఏ రాహుల్ జోహ్రీ లైంగిక వేధింపులపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. జోహ్రీని తొలగించాల్సిందేనన్న ప్యానెల్ నిర్ణయానికి చైర్మన్ వినోద్ రాయ్ అడ్డుపడ్డారు. సోషల్ మీడియాలో వేధింపుల వ్యవహారం బయటపడగానే తాము ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జోహ్రీ జవాబు ఇచ్చారని మరో సభ్యురాలైన డయానా ఎడుల్జీ తెలిపారు. జోహ్రీకి మాజీ సహచరురాలైన ఓ మహిళ లైంగిక వేధింపుల వ్యవహారాన్ని ట్విట్టర్ లో బయటపెట్టారు. ఆ తర్వాత ఆ ట్విట్టర్ హ్యాండిల్ ను తొలగించడం జరిగింది. ‘న్యాయ ప్రక్రియకు అనుగుణంగా సహజ న్యాయ నియమాలకు లోబడి నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని నియమించి పారదర్శకంగా విచారణ జరిపించాలి. ఆ కమిటీ వేగంగా దర్యాప్తు పూర్తి చేసి దీనికి సంబంధించిన వాస్తవాలు, సిఫార్సులను నివేదిక రూపంలో అందజేయాలని సీఓఏ ఓ ప్రకటనలో కోరింది.