ప్రముఖ నటుడు, దర్శకుడు మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం గుండెపోటుకు గురవ్వడంతో రంగారావుని హాస్పిటల్లో చేర్పించినట్టు తెలిపారు కుటుంబ సభ్యులు. ఆయన కుమారుడు డా మాదాల రవి మాట్లాడుతూ… తన తండ్రికి గతేడాది గుండె ఆపరేషన్ జరిగిందని.. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. అయితే శనివారం మరోసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు.
ఎర్ర సినిమాల దర్శకుడిగా ప్రసిద్ధి. రంగారావు ఒంగోలులో జన్మించారు. ప్రజా నాట్యమండలిలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేసేవారు. మరో ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ, నిర్మాత పోకూరి బాబురావులు రంగారావుకి సహాధ్యాయిలు. చైర్మన్ చెలమయ్య రంగారావు మొదటి సినిమా. యువతరం కదిలింది సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు సొంతం చేసుకున్నారు. ఎర్ర సూర్యుడు, ఎర్రమల్లెలు, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి, స్వరాజ్యం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు రంగారావు.