ప్రసూతి ఆస్పత్రుల్లో అస్తవ్యస్తం.

హైదరాబాద్‌ :
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు గందరగోళంగా ఉన్నాయి. ఒకవైపు నిఘా లేక మరోవైపు లేబర్‌ వార్డులో సిబ్బంది కొరతతో అనేక సమస్యలు ఉత్పన్నవుతున్నాయి. ప్రసూతి ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ అసలు సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదు. వార్డులో నిఘా లేదు. లేబర్‌ వార్డు, నవజాత శిశు వార్డులో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. గర్బిణులు, బాలింతలు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు.ప్రసూతి ఆస్పత్రిల్లో పురుడు పోసే లేబర్‌ వార్డుల్లో గందరగోళ వాతావరణం చోటు చేసుకోవడం అయోమయ పరిస్థితికి దారి తీస్తోంది. లేబర్‌ వార్డుల్లో శిశువులు పుట్టిన తరువాత పక్కపక్కనే పడుకోబెట్టడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం, శిశువులను సరిగ్గా గుర్తించకపోవడం వంటి కారణాలతో శిశువులను అప్పగించడంలో తేడా వస్తోంది. శిశువుల గుర్తించడానికి ట్యాగ్‌లు వెంటనే కట్టకపోవడం ఈ సమస్యకు కారణమమవుతోంది. పక్కపక్కన పడుకున్న శిశువులను తీసి ఇచ్చే సమయంలో ఏమరుపాటులో ఒకరి శిశువుకు బదులు మరొకరి శిశువును ఇవ్వడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి.లేబర్‌ వార్డుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి షిఫ్టుకు ఒక ఇన్‌చార్జి నర్సు ఉండాలి. ఆమెకు సహాయకులుగా కనీసం నలుగురు నర్సులు, మరో ఎనిమిది మంది వరకు ఆయాలుండాలి. వీరంతా కేవలం పుట్టిన శిశువులను గుర్తించి తల్లికి, బిడ్డకు ఒకే రకం ట్యాగ్‌లను ఏర్పాటు చేయడం, దానిలో పుట్టిన తేదీ, సమయం, లింగనిర్దారణ, తల్లిపేరు రాసి కడతారు. వీటి పర్యవేక్షణ ఇన్‌చార్జీ నర్సు ఆధ్వర్యంలో జరగాలి. అయితే నర్సులు, ఆయాలు తక్కువగా ఉండడంతో లేబర్‌ వార్డులో ఇద్దరు నర్సులు, నలుగురు ఆయాలతో సరిపెడుతున్నారు. కొన్నిసార్లు ఇన్‌చార్జీ నర్సు కూడా ఉండడం లేదు. దీంతో ట్యాగ్‌ కట్టడంలో కాస్తా ఆలస్యమైతే తల్లి, శిశువులను గుర్తించడం కష్టమవుతోంది. మంగళవారం సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో 18 నిమిషాల్లో ఒకే సారి 30 ప్రసవాలు జరిగాయి. దీంతో హడావుడిగా శిశువులను అప్పగించడంలో పొరపాటు జరిగింది. సిబ్బంది తగినంత ఉండి ఉంటే ఈ సమస్యలు వచ్చే కావని ఆస్పత్రి అధికారులు భావిస్తున్నార.
నవజాత శిశువు వార్డులో కూడా అంతా గందరగోళం చోటు చేసుకుంటోంది. ఎవరు పడితే వారు వస్తుంటారు..వెళుతుంటారు. ఈ వార్డులో క్రెడిల్స్‌ కంటే శిశువులే ఎక్కువగా ఉంటారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో 30 క్రెడిల్స్‌ ఉంటే 150 మందికి పైగా శిశువులు ఉంటారు. కొన్ని క్రెడిల్స్‌లో ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉంటారు. పక్క పక్కనే వీరిని పడుకోబెట్టడం వల్ల కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. బిడ్డలు తారుమారు అవుతున్న ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. నిజానికి ఈ వార్డులో కేవలం శిశువులు మాత్రమే ఉండాలి. బిడ్డకు ఆకలి అవుతున్న సమయంలో తల్లి వచ్చి పాలు పట్టించి వెళ్లిపోవాలి. కానీ, ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత కారణంగా తల్లులు అక్కడే ఉండిపోతున్నారు. వీరితోపాటు కుటుంబ సభ్యులు వస్తుండడంతో అంతా గందరగోళం ఏర్పడుతుంది. ప్రసూతి ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. అన్ని ప్రభుత్వ ప్రసూతిల్లో కట్టుదిట్టమైన భద్రత అవసరం. నిలోఫర్‌, పెట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నామ్‌కే వాస్తేగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వీటిని కూడా ఆస్పత్రి ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ శిశువుల భద్రతకు అవి ఉపయోగపడడం లేదు.
నిఘా అంతంతే….!!
ప్రసూతి ఆస్పత్రిలో బాలింతల వార్డుల్లో ఏమాత్రం నిఘా లేదు. బిడ్డల అపహరణ కేసులు చోటుచేసుకుంటున్నప్పటికీ వాటిని అరికట్టడానికి ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆగంతుకులు సులువుగా ఆస్పత్రిలో ప్రవేశించి బిడ్డలను ఎత్తుకుని పోతున్నారు. ప్రైవేటు సంస్థలకు సెక్యూరిటీని అప్పగించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు.
రోజుకు 200 వరకు ప్రసవాలు..
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రోజుకు 30 నుంచి 60 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో 30నుంచి 40, పెట్లబుర్జులో 40 నుంచి 60, గాంధీలో 30 నుంచి 40, నిలోఫర్‌లో 30నుంచి 60 వరకు ప్రసవాలు జరుగుతాయి. అయితే అన్ని ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులు, నర్సులు, ఆయాల కొరత తీవ్రంగా ఉంది. వంద మంది గర్బిణిలకు కేవల 4 నుంచి 6 మంది మాత్రమే ఉంటున్నారు. నర్సులు, ఆయాల కొరత కూడా తీవ్రంగా ఉంది. దీంతో ప్రసవాల సమయంలో శిశువులను సక్రమంగా గుర్తించడం, వారికి అప్పగించడంలో తొందరపాటు జరుగుతుంది.
పుట్టిన తరువాత శిశువులను భద్రపర్చే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీసీ కెమెరాలు ఉంటే పుట్టిన బిడ్డలు ఎవరిదో గుర్తించే వీలు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా శిశువులను తారు మారు చేయడంలో సిబ్బంది కూడా పొరపాటు చేయరని వారు భావిస్తున్నారు.