ప్రాజెక్టుల పేరుతో నోరు మూయిస్తున్న కేసీఆర్. కాళేశ్వరంతో చుట్టుముట్టనున్న ఇబ్బందులు. – కోదండరాం.

హైదరాబాద్:
ఏ ఊరికి వెళ్లినా ఎల్లంపల్లి నుండి నీళ్లు మొదట మీకే వస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా.. వాస్తవాలు అడిగినా ప్రాజెక్టుకు అడ్డం పడుతున్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్, మెదక్‌లకు కొంతవరకు మాత్రమే నీరందుతుందన్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టులు ఎలా కట్టకూడదో కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాంట్రాక్టర్లు ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తారా లేక ఇంజనీర్లా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర లేదని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం మాత్రమే ప్రాజెక్టుల రీడిజైన్ అని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలుకు ఇబ్బందులు చుట్టుకోబోతున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయన్నది అబద్దమని ఆయన చెప్పారు. కొంతమంది ధనదాహం తీర్చేందుకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టును తరలించి ఆదిలాబాద్‌ను పూర్తిగా ఎండబెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అధ్భుతమైన ఇంజనీర్లు ఉన్నారని అన్నారు. వారి స్ఫూర్తి ఫలితంగానే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాయని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఇంజనీర్లు ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రాజెక్టులపై కొట్లాడామని తెలిపారు. ఇప్పుడు మీరు ప్రభుత్వ తప్పిదాలకు సపోర్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వస్తాయని నేనే చెప్పినందుకు సిగ్గుపడుతున్నానని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఊరూరా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి ముందుందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తరతరాల భవిష్యత్‌ను ముఖ్యమంత్రి తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. గవర్నర్‌కు, రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో లక్షల ఎకరాలను ముంచేందుకు సిద్దమయ్యారని ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్టు వ్యయం ఎంతయిందో ఇప్పటి వరకు బయటపెట్టలేదు. అంతేకాకుండా బ్యాంకుల్లో ఏం తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారో చెప్పలేదని ఆయన విమర్శించారు. తప్పుడు లెక్కలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.నాలుగేళ్లుగా తుమ్మిడిహట్టిలో మట్టి ఎత్తి పోయని ప్రభుత్వం వార్దా ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తెస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొత్త ఆయకట్టు ఎంత అందుబాటులోకి తెస్తున్నారనే విషయంపై ప్రభుత్వం నోరు మెదపడంలేదన్నారు. రెండు లక్షల కోట్ల గ్లోబల్ టెండర్లను పిలిస్తే ప్రజల సొమ్ము దాదాపు రూ.40,000 వేలకోట్లు మిగిలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రాణహిత చేవెళ్లకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఆ తరువాత కూడా ఎలాంటి ఫలితం లేదని రీడిజైనింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. ప్రజలపై భరించలేనంత భారం మోపి మాట్లాడవద్దంటే ఎవరూ ఊరుకోరని అన్నారు. 152 మీటర్లలో ప్రాజెక్టు చేపడితే 1857 ఎకరాలు మునుగుతుందని కమిటీలు తేల్చాయని గుర్తుచేశారు.గోదావరిపై బ్యారేజీల అధ్యయనం కోసం కేసీఆర్ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వేశారన్నారు. మిడ్‌మానేరు నుండే ఎల్లంపల్లికి నీళ్లు పోతాయన్నారు. 85 లక్షల ఎకరాలు ఇప్పటికే సాగు చేసేందుకు ఇప్పటికే నీళ్లు రెడీగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు. ఇప్పుడు మళ్లీ రెండు లక్షలతో హడావుడిగా టెండర్లను పిలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టుల్లో ఆయకట్టు ఓవర్‌లాప్ చేసి చూపిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసమే ప్రాజెక్టులు కడతారన్నారు. గతంలో ఎప్పుడు ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు ప్రజలనుండి వసూలు చేయలేదన్నారు.