ప్రాణం తీసిన మూఢనమ్మకం.

నర్సింహులపేట:
మహబూబాబాద్‌ జిల్లా :
మూఢనమ్మకం 34 రోజుల పసికందు ప్రాణంతీసింది. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఓ మహిళ కొబ్బరికాయలు, నిమ్మ కాయలతో పాటు పసికందును వాగులో వేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బయ్యారంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం ముంగిమడుగు పరిధిలో ని నర్సింహపురం బంజరకు చెందిన గంగరబోయిన సురే్‌ష-సరిత దంపతులకు అశ్విత, ప్రవళిక, పండు(34 రోజుల మగ శిశువు) ఉన్నాడు. ఇద్దరు బాలికల తర్వాత కుమారుడు జన్మించాడనే ఆనందంతో గత మే నెల చివరలో ఉప్పలమ్మ తల్లి పండుగ చేసుకున్నారు.

ఈ నెల 8వ తేది నుంచి సరిత అనారోగ్యాని కి గురైంది. దీనికి తోడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో స్పృహ కోల్పో యి మాట్లాడుతున్న సరితను ఇరుగు పొరుగు వారి సూచన మేరకు భర్త సురేష్‌ జిల్లాలోని బయ్యారం మండలం కట్టుగూడెంలో సమ్మక్క-సారలమ్మ ఆలయం వద్ద పూజారి దేవుడమ్మ ను సంప్రదించారు. పూజారి దేవుడమ్మ పూనకం పొంది పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరి కాయలతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆమె సూచన మేరకు ఇంటికి తిరుగు ప్రయాణంలో బయ్యారం శివారు పాకాల వాగులో పూజ చేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కుంకుమ వేయమని చెప్పింది. ఈ మేరకు వారు పాకాల వాగు బ్రిడ్జిపైకి ఆటోలో చేరుకున్నారు. అప్పటికే మైకంలో ఉన్న సరిత వాగులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలతో పాటు శిశువును సైతం వేసింది. అనంతరం ఆమె కూడా వాగులో దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన భర్తతో పాటు పక్కనున్న వారు ఆమె చీర కొంగు పట్టుకొని లాగడంతో బయటపడింది. వాగులో పడిన శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. శిశువును అదే ఆటోలో స్వగ్రామం నర్సిం హపురం బంజరకు తీసుకొచ్చి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా స్పృహలోకి వచ్చిన సరిత ఏం జరిగింది.. అందరూ ఏడుస్తున్నారెందుకు.. నా కొడుకు ఎక్కడ అంటూ ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న సరిత బోరున విలపించిం ది. దీంతో అక్కడున్నవారి రోదనలు మిన్నంటా యి. ఈ ఘటనతో నర్సింహపురం బంజర గ్రామంలో విషాదం నెలకొంది.